TSRTC: మహాలక్ష్మి పథకం రికార్డు.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల బస్సు ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

Updated : 20 Dec 2023 23:45 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలిపి మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఈటీవీతో మాట్లాడారు.

‘‘మహిళల ఉచిత ప్రయాణ పథకం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది’’ అని సజ్జనార్‌ తెలిపారు. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయని ఆయన పేర్కొన్నారు. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని వివరించారు. 

కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురాకపోవడం సంస్థ దృష్టికి వచ్చిందని సజ్జనార్‌ తెలిపారు. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలు, స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్‌ కాపీలు చూపిస్తున్నట్లు తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని ఈ సందర్భంగా మహిళలను కోరారు. ఫొటో కాపీలు, స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్‌కాపీలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలన్నారు. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయని, వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలని సజ్జనార్‌ తెలిపారు. ‘‘ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో విడతల వారీగా దాదాపు 2,050 (1,050 డీజిల్.. 1,000 ఎలక్ట్రిక్) కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9వ తేది నుంచి ‘మహాలక్ష్మి’ పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. సమర్థవంతంగా ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని