Revanth Reddy: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై సీఎం రేవంత్‌ ఆరా

కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు.

Updated : 20 May 2024 20:24 IST

హైదరాబాద్‌: కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజం లేదని స్పష్టంచేశారు.

కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు మూడు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య విద్యనభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న వేళ.. సీఎం రేవంత్‌ స్పందించారు.

కిర్గిజ్‌స్థాన్‌లో మన విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి: ఒవైసీ

కిర్గిజ్‌స్థాన్‌లో కొందరు స్థానికులు మన దేశ విద్యార్థులపై హింసకు పాల్పడుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఒక విద్యార్థి తనకు ఫోన్ చేసి ఐదు రోజులుగా ఏమీ తినలేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. మన విద్యార్థుల రక్షణ కోసం కేంద్ర మంత్రి జైశంకర్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడకపోతే భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని