TG News: తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Published : 29 May 2024 16:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు.

ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు