ఈనాడు కార్యాలయంపై దాడి.. స్పందించిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

ఈనాడు కార్యాలయంపై దాడి ఘటనపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) స్పందించింది.

Updated : 28 Feb 2024 19:03 IST

దిల్లీ: ఈనాడు (Eenadu) కార్యాలయంపై దాడి ఘటనపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) స్పందించింది. కర్నూలులో జరిగిన ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. దాడిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 20న కర్నూలులోని ఈనాడు కార్యాయంలపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడిన విషయం తెలిసిందే.

ఆ రోజు ఏం జరిగిందంటే....

వందల మంది చూస్తుండగానే నిర్భీతిగా, నిర్లజ్జగా అధికార వైకాపా శ్రేణులు దౌర్జన్యానికి దిగాయి. ‘ఈనాడు’ కార్యాలయంపైకి గుంపుగా దూసుకువచ్చి గంట పాటు వీరంగం సృష్టించాయి. పోలీసులు నిలువరిస్తున్నా లెక్క చేయకుండా బరి తెగించాయి. వారి ఆగడాలను చూసి భీతిల్లిపోయిన స్థానికులు దుకాణాలు మూసివేసుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ‘ఆయన వైకాపా సీనియర్‌ మేత’ శీర్షికన ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి నిరసనగా ఫిబ్రవరి 20న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు సుమారు 250 మంది సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక్కసారిగా ‘ఈనాడు’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గట్టిగా కేకలేస్తూ గందరగోళం సృష్టించారు. మొదటి అంతస్తులోని కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు, తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లను విసిరారు. బయట ఉన్న పూలకుండీలను పగలగొట్టారు. కార్యాలయ బోర్డును, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.

ముందస్తు ప్రణాళికతో రాక..

వైకాపా మూకలు దాడికి వస్తున్నట్లు సమాచారం అందడంతో ‘ఈనాడు’ కార్యాలయంలోని సిబ్బంది అందరూ బయటకు వచ్చి తాళం వేయడంతో పెనుముప్పు తప్పినట్లైంది. 40 మంది పోలీసులు వచ్చినా ఆందోళనకారులు లెక్కచేయలేదు. వారు అల్లరిమూకలను నిలువరించడంతో విధ్వంసాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. సాయంత్రం 6.30 గంటల వరకు బీభత్సకాండ కొనసాగింది. ‘జై వైకాపా’, ‘జైజై కాటసాని’ ‘కాటసాని నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ‘ఈనాడు’ పత్రిక ప్రతులను చించేసి తగలబెట్టారు. వైకాపా శ్రేణుల ఉన్మాద చర్యలతో ఆ వీధిలోని వ్యాపారులు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో గంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని