కొత్త భాష నేర్చుకుంటున్నారా? ఇలా చేసి చూడండి!

ప్రస్తుతం సమాజంలో ఎదగాలంటే ఒక్క మాతృభాషే సరిపోదు. వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాలంటే మాతృభాషతోపాటు జాతీయ, అంతర్జాతీయ భాషలు కూడా తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. అందుకే కొన్ని అంతర్జాతీయ పాఠశాలలు

Updated : 15 Dec 2020 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత సమాజంలో ఎదగాలంటే ఒక్క మాతృభాషే సరిపోదు. వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లాలంటే మాతృభాషతోపాటు జాతీయ, అంతర్జాతీయ భాషలు కూడా తెలిసి ఉండాలి. ఎన్ని భాషలు తెలిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. అందుకే కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ఫ్రెంచ్‌, జర్మన్‌ అంటూ పలు విదేశీ భాషలను కూడా నేర్పిస్తుంటాయి. కొందరు పెద్దయ్యాక ఇతర భాషలు నేర్చుకోవడం మొదలుపెడతారు. అది మంచి పరిణామమే. నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. ఎవరైనా, ఎప్పుడైనా కొత్త భాషలు నేర్చుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకునే ఇన్‌స్టిట్యూట్‌లు, యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొత్త భాష నేర్చుకుంటున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా భాషలో పట్టు సాధిస్తారు. 

చిన్నపాటి లక్ష్యాలు పెట్టుకోండి

నేర్చుకోవడం ప్రారంభించిన తక్కువ సమయంలోనే మీరు భాషలో ప్రావీణ్యం సంపాదించలేరు. కాబట్టి, నిరుత్సాహపడకండి. నేర్చుకోవడంలో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. కొత్త భాషకు చెందిన కొన్ని పదాలను మొదట నేర్చుకోండి. వాటి అర్థం ఏంటి? ఏ సందర్భాల్లో వాటిని వాడతారో గమనించండి. పదాల గురించి తెలుసుకుంటున్న కొద్ది మీకు ఉత్సాహం.. నమ్మకం కలుగుతాయి. ఆ తర్వాతే వాక్యాలు.. వ్యాకరణంపై దృష్టిపెట్టండి.

మీ విధానంలోనే నేర్చుకోండి

కొత్త భాషను నేర్చుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో పంథా ఉంటుంది. మొదటి నుంచే కొందరు వినడం ద్వారా, మరికొందరు మాట్లాడటం ద్వారా, ఇంకొందరు చదవడం ద్వారా నేర్చుకుంటుంటారు. మీకు ఏ విధానంలో నేర్చుకోవడం సులభంగా ఉందో గుర్తించండి. దాన్నే పాటించండి. ప్రతి రోజు సాధన చేయండి. సాధన చేయడం ద్వారానే ప్రావీణ్యం సాధించగలరు. అలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలని ఇతరులు చెప్పే వాటి గురించి ఆలోచించకండి. కొన్ని సార్లు నేర్చుకునే పంథా మారడం వల్ల భాషపై ఆసక్తిపోయే అవకాశముంది.

లైఫ్‌స్టైల్‌లో భాగం చేయండి

నేర్చుకునే భాషని మీ రోజువారి జీవితంలో భాగం చేయండి. మీ ఆసక్తులను మీరు నేర్చుకునే భాషలోకి మార్చండి. ఉదాహరణకు సినిమాలు మీకు ఇష్టమైతే.. మీరు నేర్చుకునే భాషకు చెందిన సినిమాలను చూడండి. పాటలు ఆ భాషలోనే వినండి. నిత్యం మనం ఉపయోగించే పదాలను కొత్త భాషలో పలకండి. రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి. తద్వారా మీరు ఎంత తొందరగా భాషపై పట్టు సాధిస్తున్నారో తెలిసిపోతుంది.

ఆలోచన ఆ భాషలోనే

ఎదుటివాళ్లతో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలని అనే విషయాలను ముందుగానే మనం ఆలోచిస్తుంటాం. సాధారణంగా ఆ ఆలోచనలు మాతృభాషలో ఉంటాయి. ఇక వేరే భాషలో మాట్లాడాలనుకుంటే ముందుగా మాతృభాషలో అనుకొని.. దాన్ని వేరే భాషలోకి తర్జుమా చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఇదంతా కాస్త కష్టతరమైనదే. కాబట్టి, నేర్చుకుంటున్న భాషలో ఆలోచిస్తే మాట్లాడటం సులువవుతుంది కదా..! అందుకే, నేర్చుకునే భాషలోనే మీకు మీరే ప్రశ్నలు వేసుకొని, జవాబు చెప్పుకునే ప్రయత్నం చేయండి.

భాషపై పట్టున్న వారితో మాట్లాడండి

ఏ లాంగ్వెజ్‌ కోచింగ్‌ సెంటర్‌ అయినా, ఆన్‌లైన్‌ క్లాసులైనా భాషలో ప్రాథమిక అంశాలను మాత్రమే నేర్పిస్తాయి. వాటిని ఉపయోగించి మీరు మాట్లాడటం మొదలుపెడితేనే భాషపై ప్రావీణ్యం సాధించగలరు. మీరు నేర్చుకుంటున్న భాష తెలిసిన వాళ్లతో మాట్లాడండి. సరిగా మాట్లాడలేమనే భయం వద్దు. ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వారైతే.. మీరు మాట్లాడే విధానంలో తప్పొప్పుల్ని చెప్పమనండి. తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకొని మరోసారి ప్రయత్నించండి. ఇలా చేస్తే కొత్త భాషతోపాటు పదాలను పలికే తీరు కూడా తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని