Time management: ప్రణాళికబద్ధంగా రోజు గడవాలంటే ఇలా చేయండి!

రోజు అనేది ఎలాగైనా గడిచిపోతుంది. కానీ.. ఆ రోజును మనం ఎంత బాగా ఉపయోగించుకున్నాం.. ఎన్ని పనులు చేయగలిగామన్నది ముఖ్యం. పనులను సమయానుగుణంగా, ప్రణాళికబద్ధంగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే చాలా మంది వారంరోజులు, నెలరోజులకు

Updated : 02 Aug 2021 06:08 IST

రోజు అనేది ఎలాగైనా గడిచిపోతుంది. కానీ.. ఆ రోజును మనం ఎంత బాగా ఉపయోగించుకున్నాం.. ఎన్ని పనులు చేయగలిగామన్నది ముఖ్యం. పనులను సమయానుగుణంగా, ప్రణాళికబద్ధంగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అందుకే చాలా మంది వారం రోజులు, నెలరోజులకు తగినట్టు ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, వాటిని పాటిస్తారా? అంటే చెప్పడం కష్టం. మరికొందరు అసలు ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండానే రోజును ప్రారంభించేస్తారు. అలా కాకుండా సమర్థంగా సమయాన్ని ఉపయోగించుకుంటూ పనులు చేసుకోవాలంటే రోజువారీ ప్రణాళిక అసవరం. కాబట్టి ఇకపై రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. రోజువారీ ప్రణాళికను డైరీ, చిన్న నోట్‌ బుక్స్‌లో రాసుకోవచ్చు లేదా మొబైల్‌ఫోన్లలో టైం మేనేజ్‌మెంట్‌ కోసం అనేక యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తూనే ఈ నాలుగు చిట్కాలు పాటించి చూడండి.

 

ఉదయం లేవగానే ఒక 10 నిమిషాలు మీ ప్రణాళికను రూపొందించడానికి కేటాయించండి. ఆ రోజు చేయాల్సిన పనులు.. వెళ్లాల్సిన ప్రాంతాలు ఇలా అన్నింటినీ ఒక జాబితాగా రూపొందించడంతో పాటు ఒక్కో పనికి ఎంత సమయం కేటాయించగలమో రాయండి. దాన్ని బట్టి మీరు ఆ రోజు ఏ పనికి ఎంత సమయం కేటాయించగలరనే అంశంపై స్పష్టత వస్తుంది. 

రోజువారీ ప్రణాళికలో కేవలం మీ వృత్తిపరమైన పనుల గురించే కాదు.. ఆ రోజు మీరు చేయాలనుకుంటున్న వ్యక్తిగత పనుల గురించి కూడా రాయండి. అయితే, వాటికి సులువుగా గుర్తించేలా రంగులు మార్చండి. లేదా ఆ పనిని హైలైట్‌ చేయండి. అలాగే ముఖ్యమైన పనులకు ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇవ్వండి.

నోట్స్‌ కావొచ్చు.. మొబైల్‌లో యాప్‌ కావొచ్చు.. తరచూ మీ ప్రణాళికను చూసుకోవడం అలవాటు చేసుకోండి. నోట్స్‌ అయితే మీరు ఎక్కడికి వెళ్లినా తొందరగా మీ కంట పడేలా పెట్టుకోండి. యాప్‌ అయితే ఫోన్‌ స్క్రీన్‌ హోంపేజీలోనే ఉంచండి.

మీరు చేయాల్సిన పని పూర్తి కాగానే ప్రణాళికలో పూర్తయినట్లు టిక్‌ మార్క్‌ చేసుకోండి. దాని వల్ల ఓ పనిని పూర్తిచేశామన్న సంతోషం కచ్చితంగా కలుగుతుంది. మరో పనిని కూడా అలాగే పూర్తి చేయాలన్న ఉత్సాహం వస్తుంది. కాబట్టి చేయాల్సిన పనుల జాబితాను రాసి పెట్టడమే కాకుండా.. ఆ పని పూర్తికాగానే దాన్ని టిక్‌ చేయడం అలవాటుగా మార్చుకోండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని