Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 May 2024 09:04 IST

1. నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఎవరికి వాళ్లు పెరిగిన ఓట్లు మావేనని.. లెక్కలేస్తునారు. బూత్‌ల వారీగా ఎన్నేసి ఓట్లు పడ్డాయి? వాటిలో తమకెన్ని వచ్చే వీలుందనే దానిపై అభ్యర్థులు లెక్కకడుతున్నారు. తమకు ఎంత మెజార్టీకి వీలుందో.. పార్టీ శ్రేణుల వద్ద ప్రకటిస్తున్నారు.  పూర్తి కథనం

2. జాతీయ రహదారైతే మాకేంటి?

16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్‌కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. ఇవి వాహనాలు తిరిగేందుకు వీలుగా కృష్ణా జిల్లా చిన్నఆవుటపల్లి నుంచి ఏలూరు జిల్లా కలపర్రు వరకు 24 కి.మీ మేర దీనిని రెండేళ్ల కిందట ఆరు వరుసలుగా విస్తరించారు. అప్పట్నుంచి ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపివేయడం మరింత ఎక్కువైంది.  పూర్తి కథనం

3. అందనంత దూరంలో కోడి ధర..

కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. ఇందులో బ్రాయిలర్, బండ, ఫారం రకాలవి ఉంటాయి. వీటిలోనూ బ్రాయిలర్‌ విక్రయాలే అధికంగా జరుగుతుంటాయి. గతనెల వరకు రూ. 250 మీద సాగిన మాంసం ధర ప్రస్తుతం రూ. 300లకు చేరువలో ఉంది. పూర్తి కథనం

4. సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!

తాజా పండ్లు, కూరగాయలు వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పది టన్నుల సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులను గోపాలపట్నం, ఎంవీపీ కాలనీల్లోని రైతుబజారుల్లో నిర్మించారు. కొద్ది రోజులు బాగానే వాటి నిర్వహణ సాగింది. తరచూ వస్తున్న సమస్యలను అధిగమిస్తూ వచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పూర్తిగా వాటిని గాలికొదిలేశారు. ఎంవీపీ కాలనీలోని గిడ్డంగిలో శీతల యంత్రం పనిచేయడం లేదు. ఇతర సాంకేతిక సమస్యలు కొన్ని తలెత్తడంతో దాన్ని పట్టించుకోలేదు.పూర్తి కథనం

5. మీటరు గిర్రు.. గుండె గుబిల్లు

ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్‌ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్‌ నెలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదేస్థాయిలో విద్యుత్తు ‘ఖర్చు’ అయ్యింది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందెందుకు రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించారు. ఫిబ్రవరి, మార్చి వినియోగంతో పోలిస్తే ఏప్రిల్‌లో రెండు జిల్లాలోనూ ఎక్కువగా వాడారు.పూర్తి కథనం

6. గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు

7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. గేట్లకు రబ్బరు సీళ్లు అమర్చలేని పరిస్థితి నెలకొంది.. నీరంతా లీకేజీ అవుతోంది.. భారీగా వరదొస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.. నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నా.. అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. పూర్తి కథనం

7. వేట నిషేధ సాయమేదీ?

కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తికి ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 15 వరకు వేట నిషేధం అమలు చేస్తుంటారు.పూర్తి కథనం

8.అందాల కొండ... నష్టాలే నిండా!

బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ఉన్న హార్సిలీహిల్స్‌.. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంది. కొండకు ఏడాది పొడవునా పర్యాటకులు వస్తున్నప్పటికీ వేసవి సీజన్‌ మార్చి నుంచి జూన్‌ నెలాఖరు వరకు సందడిగా సాగడం ఆనవాయితీగా వస్తోంది. రోజూ 1,100 మంది పర్యాటకులు వస్తుండగా ఈసారి 350కి మించి కొండకు రాలేదని ఓ అంచనా. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. ఉక్కపోత తీవ్రస్థాయిలో ఉంది. పూర్తి కథనం

9. సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!

వేసవి పూర్తి కావస్తోంది.. సోమశిల జలాశయానికి వరదలు వచ్చేందుకు మరో మూడు నెలల సమయమే ఉంది. ఇప్పటికీ జలాశయాన్ని దీర్ఘకాలంగా వేధిస్తున్న అత్యవసర వ్యవస్థల సమస్యల పరిష్కారంపై మాత్రం దృష్టి కొరవడింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు వీటి మరమ్మతులకు అనువైన కాలం వృథాగా గడిచిపోయింది. మిగిలిన సమయాన్ని అయినా సద్వినియోగం చేసుకుంటారా! ఆ పరిస్థితీ కనిపించడం లేదు. ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అటు ప్రభుత్వం కూడా తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.పూర్తి కథనం

10. ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు

అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. ‘ఆడుదాం- ఆంధ్రా’ అంటూ హడావుడి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది తామే అంటూ ఆర్భాటపు ప్రచారం చేసుకుంది. రూ. కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఊరూరా పోటీలు నిర్వహించింది. అసంపూర్తి పాఠశాల మైదానాలు, రాళ్ల నేలలు, ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆటలాడించి అభాసుపాలైంది. తీరా ఎన్నికలు ముగిశాక ఆటలు, క్రీడాకారులను గాలికొదిలేసింది. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలకు రూపాయి కూడా కేటాయించకుంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని