Hyderabad: ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది

Updated : 29 Nov 2023 21:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. నగరంలోని ముషీరాబాద్‌ పరిధిలో నగదు స్వాధీనం వ్యవహారంలో పక్షపాతం చూపించారని డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది.

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ముషీరాబాద్‌లోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో రూ.18 లక్షల నగదు, చెక్‌బుక్‌, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ముషీరాబాద్‌ భారాస అభ్యర్థి ముఠా గోపాల్‌ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల వివరాలు గుర్తు తెలియని వారిగా పేర్కొన్నారు. ఈ కేసులో ముఠా జైసింహను కాకుండా ముఠా గోపాల్‌ స్నేహితులు సంతోష్‌, సుధాకర్‌లను అరెస్టు చేశారు. అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఈసీ గుర్తించింది. దీంతో ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐ జహంగీర్‌ స్థానంలో ముషీరాబాద్ స్టేషన్‌లో పనిచేస్తున్న డీఐ వెంకట్‌ రెడ్డిని, చిక్కడపల్లి ఏసీపీగా మధుమోహన్ రెడ్డిని, సెంట్రల్‌ జోన్ డీసీపీగా డి. శ్రీనివాస్‌ నియమించినట్లు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ప్రస్తుతం డి. శ్రీనివాస్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని