Hyderabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం శుభపరిణామం: తమిళిసై

రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

Updated : 26 Feb 2024 21:07 IST

హైదరాబాద్‌: రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు విమానాల మాదిరిగా దూసుకుపోతున్నాయని గవర్నర్‌ అన్నారు. మన రాష్ట్రానికి పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయని, భవిష్యత్‌లో మరిన్ని వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం శుభపరిణామం అని తెలిపారు. 

రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం కానుకగా ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీనిపై రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వంటి వారు చొరవచూపాలని కోరారు. దేశం నలుమూలలను కలుపుతున్న అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ  రైల్వే అని, తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చన్నారు. రైల్వే శాఖకు పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ద్ధంగా ఉందన్నారు. మోదీ అంటే అభివృద్ధికి మారు పేరు అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. బడ్జెట్‌లో రైల్వే కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,400కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు