LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 26 Feb 2024 21:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. 

నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా  అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పెండింగులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని