TSRTC: ఆర్టీసీకి ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

తెలంగాణ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

Published : 16 Jan 2024 02:28 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు పేర్కొన్నారు. ఈనెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

పండగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసీ.. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని