TSPSC Group1: గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ రద్దు.. అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది.

Updated : 25 Sep 2023 14:30 IST

హైదరాబాద్‌: గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది. మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్‌-1 ప్రకటన వచ్చింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం.. శాసనసభలో నిరుటి మార్చిలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశాక 2022 ఏప్రిల్‌ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తొలిసారితో పోలిస్తే రెండోసారికి ఏకంగా 52 వేల మంది పరీక్ష రాయలేదు. అభ్యర్థులు మానసికంగా కుంగిపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని