TSPSC: మహిళలు తాళిబొట్టు.. మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు 15 నిమిషాల ముందే నిర్వాహకులు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు.

Updated : 01 Jul 2023 10:47 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 జరుగుతుంది. పరీక్షకు 15 నిమిషాల ముందే నిర్వాహకులు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో  పలువురు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఐదుగురు అభ్యర్థులు, నాచారంలో నలుగురు, బాలానగర్‌లో ఇద్దరు అభ్యర్థుల.. ఇలా చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా రావడంతో పోలీసులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో చేసేది లేక వారంతా వెనుదిరిగారు. 

గతంలో చోటు చేసుకున్న ఇబ్బందులను, లోపాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై మహిళా అభ్యర్థులు మండిపడుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలనే నిబంధనేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు