TSRTC: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం

అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

Updated : 04 Jan 2024 17:32 IST

హైదరాబాద్‌: అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని.. లేదంటే శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళతామని అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్‌ (Sajjanar).. అద్దె బస్సుల యజమానులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అద్దె బస్సుల యజమానులు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వారం రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు ఎండీ సజ్జనార్‌ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని చెప్పారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తామని.. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈ సందర్భంగా సజ్జనార్‌ వెల్లడించారు.

సమావేశం అనంతరం అద్దె బస్సుల యజమానులు మాట్లాడుతూ.. ఐదు ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జనవరి 10వ తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని