Vijayawada: ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 23 Apr 2024 21:14 IST

అమరావతి: రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది. సదు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది.

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల వ్యవహారశైలిపై ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మరి కొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.‘‘ ప్రధాని మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫ్యల్యాలతో పాటు, ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్‌ డీజీ ఇబ్బంది పెట్టారు. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా ఆయనే బాధ్యులుగా ఉన్నారు. మూడేళ్లుగా ఇంటెలిజెన్స్‌ డీజీగా కొనసాగుతున్న అపరిమిత అధికారాలు ఉపయోగించుకుని విపక్ష నేతలను వేధిస్తున్నారు. విజయవాడ సీపీ కాంతిరాణా.. వైకాపాతో అంటకాగుతూ చిన్నా చితకా కారణాలకు కూడా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలమేరకే సీపీ నడుచుకుంటున్నారు’’ అని పురందేశ్వరి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల సీఎంపై జరిగిన రాయిదాడి ఘటనకు సంబంధించి కూడా కాంతిరాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని