Vishal: నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్‌ ఇంకా ఏమన్నారంటే?

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్‌ కోరారు. ‘రత్నం’ ప్రెస్‌మీట్‌లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.

Updated : 20 Apr 2024 20:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో జరగనున్న ఎన్నికలపై హీరో విశాల్‌ (vishal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన ‘రత్నం’ (Ratnam) ప్రెస్‌మీట్‌లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ మే 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను తమిళనాడులో ఓటు వేసినట్లు తెలిపారు. అక్కడ 70శాతం ఓటింగ్‌ నమోదైందని.. ఇంకొక 20 శాతం నమోదైనట్లైతే విప్లవాత్మకమయ్యేదన్నారు. సినిమాను ఈ శుక్రవారం కాకపోతే మరోరోజు చూడొచ్చని ఓటు వేసే అవకాశం ఒక్కరోజే ఉంటుందన్నారు. ఐదు సంవత్సరాలకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడం అందరి బాధ్యత అని.. నమ్మినవారికి ఓటు వేయాలని కోరారు. ఓటు వేయించుకున్నవాళ్లు కూడా బాధ్యతగా ఉండాలన్నారు.

‘నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను. ఎవరినీ కించపరిచేలా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఫిల్టర్‌ లేకుండా మాట్లాడుతుంటాను. తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటాను. రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ.. ఇంకో నాయకుడు పుట్టడు. రాజకీయ నాయకులు నటులుగా మాట్లాడుతున్నారు. నటులు రాజకీయ నాయకులవుతున్నారు. రాజకీయం అనేది సమాజసేవ. నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛందసంస్థ నడుపుతున్నాను. దీనిద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా అజెండా. అలానే ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల అజెండాగా ఉండాలి. ప్రజలు బెంజ్‌ కారు అడుగుతారా? బంజారాహిల్స్‌లో ఇళ్లు అడుగుతున్నారా? తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం అడుగుతారు. నేను ఇప్పుడు ఒక ఓటరుని మాత్రమే. ఏ రాజకీయ నాయకుడితోను కలిసి పని చేయను, ఏ పార్టీలోనూ కలవను’ అని విశాల్‌ అన్నారు.

‘రత్నం’ సినిమా విషయానికొస్తే.. విశాల్‌ హీరోగా హరి తెరకెక్కించిన చిత్రమిది. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రియా భవానీశంకర్‌ కథానాయిక. కుటుంబ అంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని