Andhra news: ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా విశ్వజిత్‌, విజయవాడ సీపీగా రామక్రిష్ణ

ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా  పీహెచ్‌డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Updated : 24 Apr 2024 22:34 IST

అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా 1994 బ్యాచ్ కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ కుమార్‌ విశ్వజిత్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పీహెచ్‌డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం నిన్న బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా... ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్‌ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్‌ సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం పంపిన ప్యానెల్‌ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన అధికారులు గురువారం ఉదయంలోగా బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది.

అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా... ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి, తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించొద్దని ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని