AC: ఏసీ వాడుతున్నారా? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి మార్గాలివిగో!

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Updated : 03 May 2022 09:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుంచి ఎయిర్‌ కండిషనర్లు (ఏసీలు) కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే, వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

1. కనిష్ఠ ఉష్ణోగ్రత 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలి

* సాధారణంగా ఏసీల కనిష్ఠ ఉష్ణోగ్రతను 18 డిగ్రీల వరకూ తగ్గిస్తుంటాం. ఏసీ ఉష్ణోగ్రత ఎంత తగ్గితే ఇల్లు అంత చల్లబడుతుందని భావిస్తుంటాం. కానీ, ఇది అపోహ మాత్రమే అని.. ఆన్‌ చేసిన చాలా సమయం తర్వాత ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

* ఏ కంపెనీ ఏసీ అయినా 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉపయోగించాలి. ఇది ఏసీల మన్నిక సామర్థ్యానికి కూడా మంచిది.

* ఏసీ ఆన్‌ చేసేటప్పుడు కనిపించే ఉష్ణోగ్రతను డిఫాల్ట్‌ టెంపరేచర్‌గా పిలుస్తారు. అన్ని ఏసీలు 24 డిగ్రీల దగ్గరే మొదలు కావాలని దాని అర్థం. 2020లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఈ మేరకు ఒక ఆదేశం జారీచేసింది.

2. ఇన్‌స్టలేషన్‌లో పొరపాట్లు

* ఇన్‌స్టలేషన్‌లో పొరపాట్లు కూడా ఏసీల బిల్లు పెరగడానికి కారణమని ఎలక్ట్రానిక్స్‌ సంస్థ టీసీఎల్‌ చెబుతోంది.

* మన గది సామర్థ్యం బట్టి విస్తీర్ణానికి తగినట్లుగా ఏసీని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గది విస్తీర్ణం 120 నుంచి 140 అడుగులు ఉంటే 1 టన్‌ ఏసీని తీసుకుంటే సరిపోతుంది. ఇలా గది విస్తీర్ణం బట్టి ఎంపిక జరిగితే విద్యుత్‌, కొనుగోలు వెచ్చించే మొత్తం, సౌకర్యం లాంటి విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం ఉండదు.

3.ఎండలో పెట్టకూడదు

* ఏసీ అవుట్‌ డోర్‌ యూనిట్‌లో కండెన్సర్‌ కాయిల్‌, కండెన్సర్‌ ఫ్యాన్‌ ఉంటాయి. బయటగాలిని కండెన్సర్‌ కాయిల్‌లోకి పంపేందుకు ఈ ఫ్యాన్‌ ఉపయోగపడుతుంది. దీనిపై ఎండ పడటం వల్ల గాలిని చల్లబరిచే ఏసీ సామర్థ్యం తగ్గుతుంది.
* ఎండ తగలకుండా ఉండేందుకు ఏసీకి వెనుక భాగానికి కొందరు దుస్తులు చుడుతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. అవి లోపలికి వెళ్లిపోయే ముప్పుంటుంది.

4.సర్వీసింగ్‌ తప్పనిసరి

ఏసీలకు సర్వీసింగ్‌ అవసరమని, మంచి కండీషన్‌లో ఉంటేనే విద్యుత్‌ కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి కనీసం ఒక్కసారైనా మనం ఏసీని సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఫిల్టర్లు, డక్ట్స్‌లో దుమ్ము, ధూళి పేరుకుంటాయి. వీటిని తొలగించాలి. దీని వల్ల ఏసీలో గ్యాస్‌లీక్‌ కాకుండా ఉంటుంది. కంప్రెజర్‌ వంటి భాగాలకు ముప్పు కలగదు.

5. రోజంతా ఆన్‌లో ఉంచకూడదు

ప్రస్తుతం దాదాపు అన్ని ఏసీల్లోనూ టైమర్లు ఉంటున్నాయి. మన గది ఎంత సేపటిలో చల్లబడుతుందో గమనించి ఆ సమయాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడు ఏసీ 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. కరెంటు బిల్లూ ఆదా అవుతుంది.

6.తలుపులు కిటికీలు మూసే ఉంచాలి

చల్లగాలి బయటకు పోకుండా తలుపులు, కిటికీలు ఎప్పుడూ మూసే ఉంచాలి. గదిలో వాతావరణం చల్లబడి ఎండలోపలికి రాకుండా ఉంటుంది. అద్దాల కిటికీలు ఉంటే వాటికి మందమైన కర్టెన్లు ఉంటే ఎండ లోపలికి రాదు. ఫ్రిజ్‌లు, టీవీలను బయటే ఉంచాలి. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, కంప్యూటర్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఏసీ ఉండే గదుల్లో ఇవి లేకుండా చూసుకోవాలి. దీనివల్ల గదుల్లో వేడి తగ్గి తొందరగా రూమ్‌  చల్లబడుతుంది.

7.ఫ్యాన్‌ వేసుకుంటే మంచిది

ఏసీ నడిచేటప్పుడు ఫ్యాన్‌ వేసుకుంటే గది ఉష్ణోగ్రత సాధారణం కంటే కాస్త తక్కువగా అనిపిస్తుంది. చల్లని గాలి గది నాలుగువైపులా తొందరగా వెళ్తుంది. దీంతో ఉష్ణోగ్రతను పెంచుతాం. కరెంటు ఆదా అవుతుంది. ఏసీతో పాటు ఫ్యాన్‌ కూడా వేసుకుంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ సూచనలను పాటిస్తూ.. రాబోయే కరెంటు బిల్లును కూడా దృష్టిలో ఉంచుకుంటే ఏసీ వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యతని కాపాడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని