Weather UPDate: ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

రాజస్థాన్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Published : 25 May 2024 17:03 IST

అమరావతి: రాజస్థాన్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌కు ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేసింది. శనివారం రాత్రికి ఇది తుపానుగా మారి ఆదివారం అర్ధరాత్రికి సాగర్‌ ద్వీపం- ఖేపుపారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం తుపాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి. అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు ఇవి విస్తరించాయని.. మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని ఈనెల 31 లోగానే తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని