అక్కడ ట్రాఫిక్‌ లైట్లలో నీలి రంగు ఎందుకుంటుంది?

వాహనంపై రయ్‌ రయ్‌మంటూ ఎంత వేగంగా దూసుకెళ్లినా.. ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ఎరుపు రంగు కనిపిస్తే ఆగిపోవాల్సిందే. ఆకుపచ్చ రంగు పడగానే మళ్లీ వాహనాన్ని పరుగులు పెట్టించాలి. ఈ రెండూ కాక పసుపు రంగు......

Published : 20 Nov 2020 09:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహనంపై రయ్‌ రయ్‌మంటూ ఎంత వేగంగా దూసుకెళ్లినా.. ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ఎరుపు రంగు కనిపిస్తే ఆగిపోవాల్సిందే. ఆకుపచ్చ రంగు పడగానే మళ్లీ వాహనాన్ని పరుగులు పెట్టించాలి. ఈ రెండూ కాక పసుపు రంగు మన ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద కనిపిస్తుంటుంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో ఈ మూడు రంగులే కనిపిస్తాయి. ఈ విషయంలో జపాన్‌ కాస్త భిన్నం. అక్కడ ట్రాఫిక్‌ సిగ్నళ్లలో ఎరుపు, పసుపు రంగులు కామన్‌గానే ఉన్నా.. మూడో రంగు అయిన ఆకుపచ్చ బదులు సముద్ర నీలి రంగు కనిపిస్తుంది. ఈ రంగు వాడకం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి..

కొన్ని శతాబ్దాల కిందట జపాన్‌లో కేవలం నాలుగు రంగులకు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం) మాత్రమే గుర్తింపు.. వాటికి పేర్లు ఉండేవి. వాటిలో నీలి రంగును జపనీయులు ‘అవో’ అని పిలుస్తుంటారు. ఆకుపచ్చ రంగును జపనీయులు నీలి రంగులో భాగంగానే భావించి దానిని కూడా ‘అవో’గానే పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో ఆకుపచ్చ రంగుకు జపనీస్‌లో మడోరి అనే పేరు పెట్టారు. అయినా ప్రజలు దీన్ని ‘అవో’గానే భావించేవారు. అందుకే ఇప్పటికీ ఆకుపచ్చ రంగు వస్తువులను ‘అవో’గానే పరిగణిస్తారు. ఉదాహరణకు  గ్రీన్‌ ఆపిల్స్‌ను.. అవో ఆపిల్స్‌ అనే అంటారక్కడ.

1968లో ట్రాఫిక్‌పై వియన్నా సదస్సులో వివిధ దేశాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో వాహనాలు వెళ్లడానికి ఆకుపచ్చ రంగులైట్లే వాడాలని నిర్ణయించాయి. సదస్సులో జపాన్‌ సంతకం చేయకపోయినా ప్రపంచ దేశాలను అనుసరిస్తూ ఆకుపచ్చ రంగు లైట్లను ఉపయోగించింది. అయితే స్థానికంగా దానిని అవోగా పరిగణిస్తుండటంతో.. ట్రాఫిక్‌ లైట్లకు సంబంధించిన ఉత్తర్వులు, ఇతర అధికారిక పత్రాల్లో ఆకుపచ్చ రంగును ‘మడోరి’ అని కాకుండా ‘అవో’గానే రాసుకొచ్చారు. దీనిపై జపాన్‌ భాషావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆకుపచ్చ రంగుకు మడోరి అనే పేరు ఉండగా.. అవోగానే ఎందుకు పరిగణిస్తున్నారని’ మండిపడ్డారు. 

దీంతో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ ట్రాఫిక్‌ చట్టాలను మీరకుండా ఆకుపచ్చ రంగు.. జపనీయులు మనోభావాలు దెబ్బకుండా నీలి రంగు ఉండేలా ట్రాఫిక్‌ లైట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి చూడ్డానికి ఆకుపచ్చగా ఉన్నా అసలు రంగు నీలమే ఉండేలా ‘ఆక్వా (ఆకుపచ్చ రంగులా ఉండే సముద్ర నీలం)’ రంగును ఎంపిక చేసింది. 1973లో ఈ రంగును ఉపయోగించాలని చట్టం తీసుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి జపాన్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో ఎరుపు, పసుపు, అక్వా బ్లూ రంగు లైట్లను వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు