అందం కోసం పాకులాడితే.. చివరికి!

ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని,

Updated : 02 Oct 2020 18:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని, ముక్కు, పెదాలు సరిగా లేవంటూ శస్త్రచికిత్సలు చేయించుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల అనర్థాలూ జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎంతో అందంగా తయారవుతుందనుకున్నా ఆమె ముఖం.. ఇప్పుడు సగం పక్షవాతానికి గురైంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

మనదేశంలో కొందరు సినీ సెలబ్రిటీలు ముఖంలో కొన్ని భాగాలకు శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయం తెలిసిందే. చైనా, దక్షిణకొరియా వంటి దేశాల్లో మాత్రం సామాన్యులు సైతం ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంటుంటారు. ఆయా దేశాల్లో సాధారణ ఆస్పత్రులకంటే ఇలా మనిషి ముఖాన్ని అందంగా కనిపించేందుకు శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులే ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనాలోని హాంగ్‌జు నగరానికి చెందిన జావో అనే యువతి తన ముఖంపై ముడతలు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 

అప్పటికే పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆ యువతి గత నెల 12న కూడా శస్త్రచికిత్స చేయించుకుంది. వైద్యులు ముఖంపై ఉన్న ముడతలకు సూది మందులిచ్చారు. అయితే ఈ సారి ఆమెకు జరిగిన శస్త్రచికిత్స విఫలమైంది. సెప్టెంబర్‌ 19న ఆమె ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. నోరు వంకరపోయింది. ఎడమవైపు కనుబొమ్మలు పైకి లేచి అలాగే ఉండిపోయాయి. ఎడమ కన్నును పూర్తిగా మూయలేకపోతోంది. వంకరపోయిన నోరుతో సరిగా భోజనం కూడా చేయలేకపోతోంది.

వేరే ఆస్పత్రుల్లో వైద్య నిపుణులతో పరీక్షలు చేయించగా.. జావోకి ఫేషియల్‌ నర్వ్‌ పెరాలసిస్‌ వచ్చినట్లు వెల్లడైంది. చికిత్స చేసినా ముఖం ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో వైద్యులు చెప్పలేకపోతున్నారు. జావో ముఖం శాశ్వతంగా పక్షవాతంతోనే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తన ముఖం ఇలా మారడానికి కారణమైన ఆస్పత్రిపై జావో కేసు వేసింది. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావో ఈ వివరాలు వెల్లడించింది. ఉదయాన్నే తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఎంతో బాధ కలుగుతుందని, జీవితంపై విరక్తి పుడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని