Caves: గుహలు.. కనువిందు చేసే అందాలు

సినిమాల్లో కథానాయకుడు, కథానాయిక సముద్ర తీరంలో గుహల్లోకి బోటింగ్‌ చేస్తూ దూసుకెళ్లే సన్నివేశాలను మనం చూస్తుంటాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజసిద్ధ  సౌంద్యారాన్ని తనివితీరా ఆస్వాదించాల్సిందే. అదే క్రమంలో ప్రకృతిని...

Updated : 07 Nov 2021 17:20 IST

సినిమాల్లో కథానాయకుడు, కథానాయిక సముద్ర తీరంలో గుహల్లోకి బోటింగ్‌ చేస్తూ దూసుకెళ్లే సన్నివేశాలు ఉంటాయి. అలాంటివి చూసినప్పడు ఆ ప్రకృతి సౌందర్యం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ద్వీపాల్లో, సముద్ర తీరాల వెంబడి ఉండే గుహలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సముద్ర తీర ప్రాంతాల్లో నెలవైన అందమైన గుహలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం!

కేథడ్రల్‌ కేవ్‌, న్యూజిలాండ్‌

ప్రపంచంలోనే అత్యంత సుందరమైన తీర ప్రాంతం ఉన్న దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి. చుట్టూ సముద్రంతో ప్రకృతిలోని సహజసిద్ధ అందాలను తనలో ఇముడ్చుకున్న ఆ దేశంలోని కేథడ్రల్‌ కేవ్స్‌ విశేషంగా ఆకట్టుకుంటాయి. హహేయ్‌ బీచ్‌కు సమీపంలో ఉండే కేథడ్రల్‌ గుహలను సందర్శించి తీరాల్సిందే. 

 

మార్బల్‌ కేవ్స్‌, చిలీ

తెలుపు, నలుపు చలువ రాతి ఆకారాలతో.. ఆకట్టుకునేలా ఉండే మార్బల్ కేవ్స్‌ చిలీలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత దృఢంగా ఉండే వింతైన ప్రకృతి అద్భుతం ఇది. సముద్ర జలాలు గుహలో పారుతుంటే నీలం రంగు పరచుకుందా అన్నట్లు కనిపిస్తూ కనువిందు చేస్తుంది. 
 

 

నెప్ట్యూన్స్‌ గ్రొట్టో, ఇటలీ

ఇటలీలో పోర్టో ఫెర్రో బీచ్‌ నుంచి కాస్త దూరంలో ఉన్న గుహలు నెప్ట్యూన్స్‌ గ్రొట్టో. గుహలోని పై అంచు నుంచి కిందకు వేలాడుతూ కనిపించేలా పెద్ద పెద్ద ఊడలు చూసేందుకు మహాద్భుతం!
 

 

గ్రేట్‌ బ్లూ హోల్‌, బెలిజ్‌

విహంగ వీక్షణ ద్వారా చూస్తే అక్కడేదో పెద్ద రంధ్రం పడిందా అన్నట్లు ఉంటుంది. బెలిజ్‌ కోస్తా తీరానికి 40 మైళ్ల దూరంలో ది గ్రేట్‌ బ్లూ హోల్‌  గుహలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రదేశాల్లో ఇదొకటని నిపుణులు చెబుతారు. 400 అడుగుల లోతు, 1000 అడుగుల వెడల్పుతో డైవింగ్‌ డెస్టినేషన్‌గా దీనికి పేరుంది. 
 

 

ఫింగల్‌ కేవ్, స్మూ కేవ్‌, స్కాట్లాండ్‌

ఒక్కసారైనా వీక్షించాల్సిన ప్రాంతం స్కాట్లాండ్‌లోని ఫింగల్‌ కేవ్స్‌. ప్రకృతి అద్భుతం ఏంటో అర్థమవుతోంది. షడ్భుజి ఆకారంలో నిర్మితమై ఉన్న గుహల్లో మరో వింత ఏమిటంటే..  సముద్రపు తరంగాలు ప్రతిధ్వనించేలా గుహ పైకప్పుపై ప్రత్యేకంగా ఏదో ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తు నుంచి జలపాతం పారుతుంటే.. అబ్బా.. చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు!

 

అయియా నాపా కేవ్స్‌, సైప్రస్‌

అతిచిన్న దేశమైనా అభివృద్ధిలో మాత్రం సైప్రస్‌ ముందుంటుంది. ఆర్థికంగా మాత్రమే కాకుండా పర్యాటకంలోనూ దూసుకెళ్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు సైప్రస్‌ సొంతం. గోధుమ, తెలుపు వర్ణాలతో కూడిన రాతి అందాలున్న ప్రాంతం అయియా నాపా కేవ్స్‌. పరిశుభ్రమైన సముద్రపు నీటిలో ఈ గుహలను చూడటం అరుదైన అనుభూతి.

 

బ్లూ కేవ్స్‌ (గ్రీస్‌)

సరదాగా డైవ్‌ చేయాలంటే గ్రీస్‌ వెళ్లాల్సిందే. సముద్ర జలాల్లో సర్ఫింగ్‌ చేస్తూ గుహల అందాలను వీక్షించేందుకు అనువైన ప్రాంతం గ్రీస్‌ ఐల్యాండ్‌ జాకంథోస్‌లోని బ్లూ కేవ్స్‌. అందమైన పగడాలు వెతుక్కుంటూ సముద్రంలో విహరించేవారు తప్పక పర్యటించాల్సిన ప్రదేశం ఇదని సందర్శకులు చెబుతుంటారు. 
 

 

లా జొల్లా కేవ్‌ బీచ్‌, కాలిఫోర్నియా

కాలిఫోర్నియాలో బీచ్‌లకు కొదవలేదు. అలానే సుందరమైన గుహలూ ఉన్నాయి. లా జొల్లా కేవ్స్‌ అడుగు భాగం సముద్ర నీటిని తాకుతూ ఉండే ప్రాంతాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభూతి. ఇది కాలిఫోర్నియాలోనే కాకుండా, మొత్తం అమెరికా దేశంలోనే అత్యంత చక్కటి పర్యాటక ప్రదేశం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌, ఈనాడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు