Updated : 04 Feb 2021 13:52 IST

మడగాస్కర్‌లో తొలి 3డీ ప్రింటింగ్‌ పాఠశాల

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా కొన్ని నెలలపాటు మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన విద్యార్థులంతా ఇప్పుడు తరగతి గదుల్లో కూర్చుంటున్నారు. అయితే, కరోనా సంక్షోభం కారణంగా నిర్వహణశక్తి లేక శాశ్వతంగా మూతపడిన చిన్న చిన్న పాఠశాలలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మరోవైపు కరోనా తెచ్చిన ఆర్థిక కష్టాలతో పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థులూ ఉన్నారు. ఈ రెండు సమస్యలకు ఓ స్వచ్ఛంద సంస్థ పరిష్కారం చూపుతోంది. పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్‌ పాఠశాలలు నిర్మించ తలపెట్టింది. వీటి ద్వారా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను తిరిగి పాఠశాలలకు రప్పించే ప్రయత్నం చేయనుంది. 

అమెరికాకు చెందిన మ్యాగీ గ్రౌట్‌ ‘థింకింగ్‌ హట్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా చిన్నారులందరికీ విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పాఠశాలలు లేని ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చి మడగాస్కర్‌లో తొలి 3డీ పాఠశాలను నిర్మించబోతున్నారు. ఇందుకోసం శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌ ఏజెన్సీ మోర్టాజావి స్టూడియోతో చేతులు కలిపారు. ఈ పైలట్‌ ప్రాజెక్టును మడగాస్కర్‌లోని ఫనారన్‌సోవాలో ఉన్న ఎకోల్‌ డి మేనేజ్‌మెంట్‌ ఎట్‌ డి ఇన్నోవేషన్‌ టెక్నాలజీ (ఈఎంఐటీ) యూనివర్సిటీ క్యాంపస్‌లో చేపట్టారు.

గోడలు, పైకప్పు, ఇతర ఉపకరణాలు 3డీలోనే ప్రింట్‌ చేసి వాటితో పాఠశాల నిర్మిస్తారట. ఇందుకోసం పునరుత్పాదక వస్తువులనే ఉపయోగించనున్నారు. ఈ విధానంలో పాఠశాలలు నిర్మించడం ద్వారా నిర్మాణ సమయం నెలల నుంచి రోజులకు తగ్గిపోతుందని, నిర్మాణం సమయంలో కార్బన్‌డైఆక్సైడ్‌ వెలువడటానికి ఆస్కారం ఉండదని మ్యాగీ గ్రౌట్‌ అంటున్నారు. అలాగే ఈ 3డీ పాఠశాలలు విద్యారంగం మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు. మడగాస్కర్‌లో ప్రారంభించిన ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే వేసవిలో ప్రారంభం కానున్న 2021-22 విద్యా సంవత్సరంలో వీటిని అందుబాటులోకి తెస్తామని, అన్ని తరగతుల విద్యార్థులను ఆహ్వానిస్తామని చెప్పారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ 3డీ ప్రింటింగ్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. విద్యాపరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మడగాస్కర్‌లో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించినట్లు థింకింగ్‌ హట్స్‌ సంస్థ తెలిపింది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని