తుపాకీ కావాలా మీ ఇంటికే తెచ్చిస్తాం

ఆయుధాల దందా అంగట్లో సరకులా మారుతోంది. నేరగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా దేశవాళీ తుపాకులు, పిస్టళ్లు అమ్మకానికి పెడుతున్నారు.

Updated : 28 May 2024 09:28 IST

సామాజిక మాధ్యమాల్లో ఆయుధాల దందా
రాష్ట్రాల సరిహద్దులు  దాటిస్తున్న నేరగాళ్లు

ఈనాడు- హైదరాబాద్‌: ఆయుధాల దందా అంగట్లో సరకులా మారుతోంది. నేరగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా దేశవాళీ తుపాకులు, పిస్టళ్లు అమ్మకానికి పెడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలు, డార్క్‌నెట్‌లో తుపాకుల చిత్రాలతో సహా పెట్టి అమ్మేస్తున్నారు. ఏ మోడల్‌ కావాలన్నా అందించేలా ఈ దందా నడుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో తమను సంప్రదించిన వారికి డోర్‌ డెలివరీ చేసేస్తున్నారు. ఇటీవల జీడిమెట్ల ఠాణా పరిధిలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అరెస్టు చేశారు. అతని వద్ద మూడు బుల్లెట్లు, ఒక దేశవాళీ తుపాకీ దొరికాయి. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.  

లాభదాయక వ్యాపారం

ఇతర రాష్ట్రాల్లో కొన్నప్పుడు రూ.50 వేల విలువుండే దేశవాళీ ఆయుధం.. నగరానికి చేరుకునేసరికి నాలుగైదు రెట్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రౌడీషీటర్లు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌.. తర్వాత డెలివరీ

సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పేర్లు, సంకేతాలతో కొందరు పేజీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనే ఆయుధాల చిత్రాలు, ధర నిర్ణయించి పోస్టు చేస్తుంటారు. ప్రధానంగా బిహార్, ఒడిశా, రాజస్థాన్, యూపీలోని కొందరు దేశవాళీ తుపాకులు ఈ విధానంలోనే విక్రయిస్తున్నారు. డార్క్‌నెట్‌ మీద నిపుణుల సాయంతో శిక్షణ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువగా గన్స్, డ్రగ్స్, యువతుల కోసం వెతుకున్నట్లు నిపుణుల అధ్యయనంలోనూ వెల్లడైంది.

రైళ్లు, ట్రావెల్స్‌లో రవాణా

అక్రమ ఆయుధాల్ని రవాణా చేసేందుకు నేరగాళ్లు రైళ్లు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్ని ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు బదులుగా.. ప్రయాణికులు తక్కువగా ఉండే స్టేషన్లలో దిగిపోతారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనాలు లేదా ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానానికి చేరుస్తుంటారు. కొందరు ద్విచక్రవాహనాల మీద వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగుచూస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని