Expressway: 100 గంటల్లో 100 కి.మీ రహదారి నిర్మాణం!

ఘజియాబాద్‌-అలీగఢ్‌ మధ్య 100 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేవలం 100 గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. దీని కోసం గ్రీన్‌ టెక్నాలజీని ఉపయోగించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

Published : 19 May 2023 21:29 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ - అలీగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం రికార్డు సృష్టించింది. కేవలం 100 గంటల్లో 100 కి.మీ పొడవైన పొడవైన రహదారిని నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా రహదారి మౌలిక సదుపాయాల పరిశ్రమ అంకితభావాన్ని ప్రశంసించింది. రహదారి నిర్మాణంలో పాలు పంచుకున్న వారిని అభినందించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌34లో ఘజియాబాద్‌-అలీగఢ్‌ మధ్య 118 కి.మీ పొడవైన మార్గం ఎంతో కీలకమని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌, సికందర్‌బాద్‌, బులంద్‌ షహర్‌, కుర్జా తదితర పట్టణాలను కలుపుతూ ఈ రహదారి వెళ్తుండటం కలిసొచ్చే అంశమని గడ్కరీ తెలిపారు. వర్తక నిర్వహణకు ఈ రహదారి కీలకంగా పని చేస్తుందని వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని గడ్కరీ అన్నారు. ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్‌ టెక్నాలజీని వినియోగించినట్లు చెప్పిన నితిన్‌ గడ్కరీ.. దాదాపు 90 శాతం మిల్లింగ్‌ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. దీనివల్ల రహదారి నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని