NITI Aayog Report: ఐదేళ్లలో 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు!

భారత్‌లో 2015-16 నుంచి 2019-21 మధ్యకాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ‘జాతీయ పేదరిక సూచీ’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Published : 18 Jul 2023 01:50 IST

దిల్లీ: భారత్‌లో ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ‘నీతి ఆయోగ్‌ (NITI Aayog)’ తాజా నివేదికలో ఇది వెల్లడయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని తేలింది. ‘జాతీయ బహుళ కోణ పేదరిక సూచీ (MPI): 2023’ పేరిట నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ సోమవారం ఈ నివేదికను విడుదల చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) (2019-21) వివరాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు.. ఈ మూడు అంశాల్లోని పోషకాహారం, శిశుమరణాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బ్యాంకు ఖాతాల వంటి 12 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు.

‘దేశంలోని పేదల శాతం.. 2015-16లో 24.85గా ఉండగా, 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. పేదరిక తీవ్రత 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది. ఈ ఐదేళ్లలో ఎంపీఐ విలువ 0.117 నుంచి సగానికి (0.066) తగ్గింది. తద్వారా ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1.2 (పేదరికాన్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించడం)ను ముందుగానే సాధించే దిశగా భారత్‌ పురోగమిస్తోందని ‘నీతి ఆయోగ్‌’ తెలిపింది. పారిశుద్ధ్యం, పాఠశాల విద్య, పోషకాహారం, వంట ఇంధనం వంటి సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరచడంతో.. ఈ పురోగతి సాధ్యమైందని నీతి ఆయోగ్ పేర్కొంది.

భారత్‌లో గణనీయంగా తగ్గిన పేదరికం.. 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది బయటకు!

ఇదిలా ఉండగా.. భారత్‌లో 15 ఏళ్ల వ్యవధిలో దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల ఓ ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ ‘పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ (ఓపీహెచ్‌ఐ)’లు కలిసి ‘అంతర్జాతీయ పేదరిక సూచి (ఎంపీఐ)’ని విడుదల చేశాయి. భారత్‌, చైనా, కాంగో, ఇండోనేసియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని.. 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయని పేర్కొంది. తాజాగా నీతి ఆయోగ్ ‘జాతీయ బహుళ కోణ పేదరిక సూచి’లోనూ ఇదే తరహా సానుకూల ఫలితాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని