Parliament: బడ్జెట్‌ సమావేశాల వేళ.. 14 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత!

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతోన్న వేళ.. గత శీతాకాల సమావేశాల నుంచి 14 మంది విపక్ష ఎంపీలపై కొనసాగుతోన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు.

Published : 30 Jan 2024 22:29 IST

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు (Budget Session) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో.. గత శీతాకాల సమావేశాల నుంచి 14 మంది విపక్ష ఎంపీలపై కొనసాగుతోన్న సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌లు ఎత్తివేశారు. దీంతో బుధవారం నుంచి మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో వారు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.

పార్లమెంటులో భద్రత వైఫల్యం ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలతో గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో లోక్‌సభ, రాజ్యసభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో మొత్తం 146 మంది ఎంపీల (100 మంది లోక్‌సభ, 46 మంది రాజ్యసభ)పై సస్పెన్షన్‌ వేటు పడింది. వీరిలో 132 మందిపై అప్పటి సమావేశాల వరకే చర్యలు తీసుకున్నారు. మిగతా 14 మంది ఎంపీల (11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ) ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి.. సభాహక్కుల కమిటీ (Privileges Committee)లకు సిఫార్సు చేశారు.

31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు.. అబ్దుల్‌ ఖాలిక్‌, కె.జెయకుమార్‌, విజయ్‌ వసంత్‌లు తమ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలో వారి సస్పెన్షన్‌ను రద్దు చేయాలని లోక్‌సభా సభాహక్కుల కమిటీ సిఫార్సు చేసింది. రాజ్యసభ సభాహక్కుల కమిటీ మాత్రం.. ఆ 11 మంది ఎంపీలు నిబంధనల ఉల్లంఘన, సభా ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చింది. ఈమేరకు మంగళవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖఢ్‌కు నివేదిక సమర్పించింది. సస్పెన్షన్‌ కాలాన్ని తగిన శిక్షగా పరిగణించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఛైర్మన్‌ తన అధికారాన్ని వినియోగించుకుని వారి సస్పెన్షన్‌ను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ (Interim Budget) పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌- మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని