Canada visa: కెనడా కాన్సులేట్లలో సేవలు నిలిపివేత.. 17,500 వీసా దరఖాస్తులపై ప్రభావం..?

బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌ నగరాల్లో ఉన్న కెనడా కాన్సులేట్లలో (Canada Consulate) అన్ని రకాల వ్యక్తిగత సేవలను నిలిపివేయడంతో 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Oct 2023 17:10 IST

దిల్లీ: కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతర పరిణామాలతో భారత్‌-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని భారత్‌ చేసిన సూచనల ప్రకారం చర్యలు చేపట్టిన కెనడా.. అనేక మంది సిబ్బందిని వెనక్కి రప్పించుకుంది. దీంతో బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌ నగరాల్లోని కాన్సులేట్‌లలో (Canada Consulates) అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. ఈ పరిణామాలు కెనడా వెళ్లాలనుకునే భారతీయులపై ఏమేరకు ప్రభావం చూపనుందన్న విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 17వేలకు పైగా వీసా దరఖాస్తులపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా.

  • భారత్‌ నుంచి 41 మంది దౌత్య సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు 42 మందిని కెనడా వెనక్కి పిలిపించుకుంది. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే దిల్లీలోని కెనడా హైకమిషన్‌తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు.
  • బెంగళూరు, ముంబయి, చండీగఢ్‌ నగరాల్లో అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎవరికైనా కాన్సులర్‌ సహాయం కావాలంటే దిల్లీలోని కెనడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
  • భారత్‌లో 27 మంది ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ఉండగా.. ఆ సంఖ్య ఐదుకు తగ్గించినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజీ అండ్‌ సిటిజన్‌షిప్‌ వెల్లడించింది. విదేశాల నుంచి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలతో వీసా జారీ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
  • సిబ్బందిని తరలించడం ద్వారా డిసెంబర్‌ చివరినాటికి 17,500 బ్యాక్‌లాగ్‌ దరఖాస్తుల నిర్ణయంపై ప్రభావం చూపనున్నట్లు అంచనా. సిబ్బందిని తగ్గించినప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న కెనడా ప్రతినిధులు ఈ వ్యవహారాలు చూస్తారని చెప్పింది.
  • భారత్‌- కెనడా పౌరుల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందని.. భారతీయులను ఎప్పుడూ స్వాగతిస్తామని కెనడా వెల్లడించింది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, సన్నిహితులతో కలిసి ఉండటంతోపాటు శాశ్వతంగా కెనడాలో ఉండేందుకు స్వాగతం పలుకుతామని తెలిపింది.
  • సుమారు 3.8 కోట్ల జనాభా కలిగిన కెనడాలో 20లక్షల మంది భారతీయులే. అక్కడికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో 40 శాతం మనవాళ్లే ఉంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని