Pune Car Crash: నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌నే మార్చేసిన ఫోరెన్సిక్‌ వైద్యులు: పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌

పుణెలో లగ్జరీకారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ట్విస్టులు ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డాక్టర్లే రక్త నమూనా పరీక్ష నివేదికను మార్చేందుకు యత్నించినట్లు గుర్తించారు. 

Updated : 27 May 2024 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ పోర్ష్‌ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ (Pune Car Crash) కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్‌ను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడైన మైనర్‌ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించారు. తాజాగా వారిపై చర్యలు మొదలుపెట్టారు. సాసూన్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ అజేయ్‌ తావ్‌రే, డాక్టర్‌ శ్రీహరి హార్నూర్‌ను పుణె క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారు. పుణెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ తావ్‌రే ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉన్న నిందితుడు (మైనర్‌) రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్‌ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు.   కానీ, పోలీసులు అనుమానంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు ధ్రువీకరించుకొన్నారు. దీంతో డాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు. రక్త పరీక్షల సమయంలో మైనర్‌ నమూనాలను పారేసి.. మరో వ్యక్తి నమూనాలను వీరు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. 

ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పుణె పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు సమయంలో నగర కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఇదేదో మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్‌ కేసు కాదు. నిందితుడైన మైనర్‌కు తాను పార్టీ చేసుకొంటూ ఆల్కహాల్‌ తాగిన విషయం స్పష్టంగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కారు నడిపితే రోడ్డుపై వారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతడికి పూర్తి అవగాహన కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. 

గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బాలుడికి జువైనల్‌ కోర్టు కొన్ని షరతులతో (Bail Conditions) కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. కోర్టు తీర్పుపై విమర్శలు రావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించింది. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకు తీవ్ర యత్నాలు..

నిందితుడి తండ్రి నగరంలో బడా రియల్టర్‌. ఈ కేసును తప్పుదోవ పట్టించి మైనర్‌ను రక్షించేందుకు మైనర్‌ కుటుంబీకులు తీవ్ర యత్నాలు చేశారు. వారి డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి, తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు. అంతేకాదు.. కొందరు పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరు అధికారులపై వేటువేశారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్‌ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్తనమూనాలను తారుమారు చేయడానికి యత్నించినట్లు తేలడం ఆందోళనకరంగా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని