Kashmir: ఆహారం కోసం స్థానికుడిని కొట్టిన ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌ చేసిన సైన్యం..!

తమ అవసరాలు తీర్చలేదని స్థానికులను హింసించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రస్తుతం కాలాకోట్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో లష్కరే కీలక కమాండర్‌ను మన దళాలు హతమర్చాయి. 

Updated : 23 Nov 2023 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌లోని ఓ గ్రామంలో ఆహారం కోసం కొందరు ఉగ్రవాదులు స్థానికులను దారుణంగా కొట్టారు.. ఈ విషయం సైన్యానికి తెలిసింది. అంతే భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో ఐదుగురు సైనిక సిబ్బంది మృతి చెందారు. అయినా లెక్కచేయకుండా ఆపరేషన్‌ కొనసాగించి ఉగ్రసంస్థ టాప్‌ కమాండర్‌ను మన దళాలు మట్టుబెట్టాయి. 

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కాలాకోట్‌ అడవుల్లో దాదాపు 24 గంటల నుంచి జరుగుతున్న భీకర ఎన్‌కౌంటర్‌లో పురోగతి కనిపించింది. నేడు భద్రతా దళాలు లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఒక టాప్‌ కమాండర్‌ను, ఒక స్నిపర్‌ను హతమార్చాయి. మృతులను పాక్‌ జాతీయులుగా గుర్తించారు. వీరిలో ఖారీ అనే ఉగ్రవాది లష్కరేలో అత్యున్నత హోదాలో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని మళ్లీ ఎగదోయడమే లక్ష్యంగా అతడు పాక్‌ నుంచి వచ్చాడు. ఐఈడీలను పేల్చడం, గుహల్లో దాక్కొని ఉగ్రకార్యకలాపాలు జరపడంలో నిపుణుడిగా అతడిని సైన్యం గుర్తించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై సైన్యం పీఆర్‌వో మాట్లాడుతూ ఖారీ అనే ఉగ్రవాది అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో శిక్షణ పొందాడని పేర్కొన్నారు. అతడు లష్కరే ఉన్నత స్థాయి హోదాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఇక మరణించిన రెండో ఉగ్రవాది అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన స్నిపర్‌గా పేర్కొన్నారు.  

స్థానికులపై దాడితో వెలుగులోకి..

ఇటీవల బిజిమాల్‌ గ్రామం వద్ద ఆహారం ఇవ్వలేదని స్థానిక గుజ్జర్‌ను కొందరు ఉగ్రవాదులు దారుణంగా కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు భద్రతా దళాలకు సమాచారం అందించారు. వెంటనే సైన్యం ఇతర దళాలతో సమన్వయం చేసుకొంటూ యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ చేపట్టింది. కాకపోతే పర్వతాల్లో నక్కిన  ఉగ్రవాదులకు అక్కడి ప్రాంతాలపై పరిజ్ఞానం ఉండటంతో మన దళాలపై భారీగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లతోపాటు.. మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో సైనికుడు నేడు మరణించాడు.  

నిన్న రాత్రే అదపు బలగాలను ఈ ప్రాంతానికి రప్పించి.. ఉగ్రవాదులు నక్కిన ప్రదేశాన్ని పూర్తిగా మన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. తొలుత ఇద్దరు ఉగ్రవాదులే ఉన్నట్లు భావించారు. కానీ, కాల్పులు జరిగిన తీరును అంచనావేసిన తర్వాత వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ఈ ఉగ్రవాదులు దాదాపు ఏడాది నుంచి రాజౌరీ-పూంచ్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైన్యం అంచనాకొచ్చింది. డాంగ్రి, కాండీ దాడులకు ఇతడే మాస్టర్‌మైండ్‌ అని భావిస్తున్నారు. ఈ దాడుల్లో పౌరులు మృతి చెందారు.  ఇక నవంబర్‌ 19వ తేదీన ఇక్కడ ఉగ్రకదలికలపై సమాచారం అందడంతో సైన్యం కూంబింగ్‌ చేపట్టింది. బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ మొదలైంది. దీనిలో 9 పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన కెప్టెన్‌ శుభం గుప్తా, 63 రాష్టీయ రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్‌ ఎంవీ ప్రంజల్‌ , హవాల్దార్‌ అబ్దుల్‌ మాజిద్‌, మరో ఇద్దరు సైనికులు మరణించారు. మరో మేజర్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు.  

గత రెండేళ్లలో రాజౌరీ-పూంచ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కనీసం 30 మంది సైనిక సిబ్బంది మరణించారు. 2003-21 వరకు ఇక్కడ ఉగ్రకదలికలు తగ్గాయి. కానీ, ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీగా ఉగ్రకార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

పీర్‌పంజల్‌ రేంజిలోని పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్‌ నుంచి సరిహద్దు దాటుకొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ లేదా దోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వశ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకమైనవి.

ఇక్కడి దాదాపు 15 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక ఆపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. ఇక్కడి పరిస్థితి అఫ్గానిస్థాన్‌లోని పర్వత శ్రేణుల్లా ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతారు. దీనికి చిక్కటి అడవులు తోడు కావడంతో ఎంత పెద్ద దళానికైనా.. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవాలన్నా భారీగా శ్రమించాల్సి వస్తుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా ఇక్కడకు అత్యంత సమీపంలోనే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని