Lok Sabha Elections: ఝూఠోకే సర్దార్‌.. దో శహజాదే.. ప్రచార పర్వంలో పదనిసలెన్నో!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచార పర్వంలో చర్చనీయాంశంగా మారిన కొన్ని విమర్శనాస్త్రాలను పరిశీలిస్తే..

Published : 31 May 2024 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝూఠోకే సర్దార్‌.. దో శహజాదే.. అనుభవీ చోర్‌.. విష గురు.. ఈ పేర్లన్నీ ఏదో సినిమా కథకు సంబంధించినవి అనుకుంటున్నారా! లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు ప్రయోగించిన విమర్శల బాణాలివి. ఈ క్రమంలోనే కంగనారనౌత్‌పై కాంగ్రెస్‌ నేత సుప్రియశ్రీనేత్‌, బెంగాల్‌లో మమతా బెనర్జీపై భాజపా అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మండే ఎండలకు దీటుగా సాగిన లోక్‌సభ ప్రచారపర్వంలో చర్చనీయాంశంగా మారిన కొన్ని విమర్శనాస్త్రాలను పరిశీలిస్తే..

టెంపో బిలియనీర్ల చేతిలో తోలుబొమ్మ

పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీల నుంచి టెంపోల కొద్దీ నల్లడబ్బు కాంగ్రెస్‌కు ఏమైనా అందిందా? అని ప్రధాని మోదీ ఓ సందర్భంలో ఆరోపించారు. దీనిపై రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘టెంపో బిలియనీర్ల’ చేతిలో ప్రధాని మోదీ ‘తోలుబొమ్మ లాంటి 21వ శతాబ్దపు రాజు’ అంటూ ఎద్దేవా చేశారు.

దో శహజాదే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రచారంలో భాగంగా మోదీ పలుమార్లు ‘దో శహజాదే (ఇద్దరు యువరాజులు)’ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఇద్దరు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ.. రాహుల్‌గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌లనుద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజులు, మహారాజులను అవమానించిన కాంగ్రెస్‌ యువరాజు.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని విమర్శించారు.

మోదీ ‘విష గురు’

మోదీ ప్రసంగాలపై హస్తం పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విరుచుకుపడ్డారు. ప్రచారంలో వాడుతోన్న భాష చూస్తుంటే.. ఆయన ‘విశ్వ గురువు’ కాదని.. ‘విష గురువు’ అని మండిపడ్డారు. అదేవిధంగా మోదీ ‘స్వయం ప్రకటిత భగవానుడు’ అని ఎద్దేవా చేశారు.

అనుభవీ చోర్‌..

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు తన తప్పులను ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలుసని.. ఆయన ‘అనుభవీ చోర్‌ (అనుభవం ఉన్న దొంగ)’ అని మోదీ ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ఈమేరకు స్పందించారు.

మంగళసూత్ర, ముజ్రా, మఛిలీ, మటన్‌..

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి.. అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తుందని, మహిళల ‘మంగళ సూత్రాల’నూ వదలదంటూ మోదీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఓటుబ్యాంకు ముందు బానిసలుగా మారిన విపక్షాలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ‘ముజ్రా’ (కచేరీలు, వేడుకల్లో వేశ్యలు చేసే నృత్యాలు) చేస్తున్నాయని విమర్శించారు. శ్రావణమాసంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చేపలు (మఛిలీ), రాహుల్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌లు మటన్‌ తిన్నారంటూ భాజపా వర్గాలు మండిపడ్డాయి.

ఝూఠోకే సర్దార్‌..

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ, రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తావిస్తూ.. ప్రధానిని ‘ఝూఠోకే సర్దార్‌ (అబద్ధాల రాజు)’గా పేర్కొన్నారు.

‘ఉద్యోగ భక్షకి’ భాజపా

పశ్చిమబెంగాల్‌లో దాదాపు 26 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన అనంతరం.. సీఎం మమతాబెనర్జీ భాజపాను ‘ఉద్యోగ భక్షకి’ అని విమర్శించారు.

రాహుల్‌ 107.. ప్రియాంక 108

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలను ‘అమూల్‌ బేబీలు’గా ఎద్దేవా చేశారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ‘కాగితపు సీఎం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ, మండీలో కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌లను కంగన రనౌత్‌ పెద్ద పప్పు, చిన్న పప్పులుగా చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం సమాజ్‌వాదీ పార్టీని ‘సమాప్త పార్టీ’గా, కాంగ్రెస్‌ను ‘కౌన్ కాంగ్రెస్‌ (కాంగ్రెస్‌ ఎవరు)’గా పిలుస్తారని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘం కన్నెర్ర..

అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం పలు సందర్భాల్లో కన్నెర్ర చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపైనా విరుచుకుపడింది. ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నాయకుల నుంచి మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో ఆమేరకు నడచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని