Bengaluru: తాగునీరు అనవసర వాడకం.. 22 కుటుంబాలకు జరిమానా

బెంగళూరు నగరాన్ని తాగునీటి కొరత వేధిస్తున్న వేళ అనవసర పనులకు వినియోగిస్తూ వృథాకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

Updated : 25 Mar 2024 18:23 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) నగరవాసుల్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. ఈనేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. అనవసర పనులకు తాగునీరు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నీటి వృథాపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. నీటికొరత నేపథ్యంలో తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్ట్టినట్లు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) తెలిపింది.  తాగునీటిని కార్‌ వాషింగ్‌ లేదా గార్డెనింగ్‌ వంటి అవసరాలకు వాడినందుకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 కుటుంబాల నుంచి మొత్తం రూ.1.1లక్షల మేర జరిమానాగా వసూలు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానాగా వసూలు చేసినట్లు పేర్కొంది.

సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్‌ ‘4 టిప్స్‌’.. రోజుకు 600 లీటర్లు సేవ్‌ చేశారట..!

నగరంలో నీటి కటకటను దృష్టిలోఉంచుకొని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఇటీవల నీటి సరఫరా బోర్డు ప్రజలకు సూచించింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం తాగునీరు వాడొద్దని కోరింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.  మళ్లీ ఈ చర్య పునరావృతమైతే ప్రతిసారీ రూ.500 అదనంగా జరిమానా విధించాలని నిర్ణయించింది. మరోవైపు, హోలీ వేడుకల సందర్భంగా ప్రజలు కావేరీ, బోరుబావుల నీటిని పార్టీలు, రెయిన్‌ డ్యాన్స్‌ల కోసం వినియోగించొద్దని సూచించింది. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎయిరేటర్లు అమర్చేలా హోటళ్లు, అపార్టుమెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని