సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్‌ ‘4 టిప్స్‌’.. రోజుకు 600 లీటర్లు సేవ్‌ చేశారట..!

Bengaluru Water Crisis: బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్‌ కొన్ని టిప్స్‌తో రోజుకు 600 లీటర్లు నీటిని ఆదా చేశారట. వాటిని ఆమె వివరించగా.. అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి ఆ టిప్స్‌ ఏంటో మీరే చూడండి..!

Updated : 18 Mar 2024 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక (Karnataka)లో గత కొన్ని రోజులుగా తీవ్ర నీటి కొరత (Water Crisis) ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు నగరానికి చెందిన ఓ డాక్టర్‌ దివ్య శర్మ సమయస్ఫూర్తితో ఆలోచించారు. రోజువారీ జీవన విధానంలో ఎలాంటి రాజీ పడకుండానే నీటి వినియోగంలో చిన్నచిన్న మార్పులు చేశారు. అవి ఫలించడంతో రోజుకు 600 లీటర్ల నీటిని ఆదా చేసుకోగలిగారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. మరి ఆ టిప్స్‌ (water saving tips) ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

‘‘నలుగురు సభ్యులుండే మా ఇంట్లో చిన్న మార్పులతో రోజూ కొంత నీటిని ఆదా చేయగలిగాం.

1.ఓవర్‌హెడ్‌ షవర్లను తీసేశాం. షవర్‌తో నిమిషానికి 13 లీటర్ల నీరు వినియోగిస్తాం. అంటే 5 నిమిషాల స్నానానికి 65 లీటర్లు. అదే బకెట్‌ అయితే 20 లీటర్లతో స్నానం ముగించొచ్చు. ఇలా మేం ఒక్కో వ్యక్తికి 45 లీటర్ల చొప్పున.. 180 లీటర్లు ఆదా చేశాం.

2. కుళాయిలకు ఏరేటర్స్‌ (ధారగా కాకుండా చిల్లులా నీరు పడేందుకు వీలుగా) ఏర్పాటుచేశాం. దీనివల్ల ఒక రోజు మొత్తంలో గిన్నెలు శుభ్రం చేయడానికి 90 లీటర్ల నీరు సరిపోయింది. అంతకుముందు దీనికి 450 లీటర్లు ఉపయోగించేవాళ్లం. అంటే దాదాపు 360 లీటర్లు సేవ్‌ చేయగలిగాం.

3. ప్యూరిఫయర్‌ నుంచి వచ్చే నీటిని సేకరించి ఇల్లు తుడవడానికి, గార్డెనింగ్‌కు ఉపయోగించాం. దీంతో 30 లీటర్లు ఆదా అయ్యింది. 

4. కార్‌ వాష్‌ చేయడం ఆపేశాం. దుమ్ము తుడుచుకుని.. రోజు మార్చి రోజు తడి గుడ్డతో శుభ్రం చేసుకున్నాం. ఇలా మరో 30 లీటర్లు సేవ్‌ చేశాం.

ఇలా రోజువారీ జీవనానికి ఎలాంటి ఆటంకం లేకుండానే చిన్నచిన్న టిప్స్‌ను పాటించి నీటిని మెరుగ్గా వినియోగించుకోగలిగాం’’ అని దివ్య సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ డాక్టర్‌ ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని