Smart phones: 25లక్షల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు యోగి కేబినెట్‌ ఆమోదం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Published : 22 Aug 2023 22:50 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1,250 కోట్ల వ్యయంతో అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అలాగే, రాష్ట్రంలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 25లక్షల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు సహా మొత్తం 23 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు యూపీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా వెల్లడించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని 18 డివిజన్లలో భారీ వ్యయంతో 18 అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.  ఒక్కో పాఠశాలను 1000 మంది సామర్థ్యం (500 మంది బాలికలు, 500మంది బాలురు)తో ఏర్పాటు చేస్తామని, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన ఉంటుందని వివరించారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు వీటిలో అడ్మిషన్లు కల్పించనున్నట్టు చెప్పారు. ఈ పాఠశాలలు ఎక్స్‌లెన్స్‌ సెంటర్లుగా ఉంటాయన్నారు. 

మరోవైపు, స్వామి వివేకానంద యూత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 25లక్షల స్మార్ట్‌ఫోన్లు కొనుగోలుకు కేబినెట్‌ అంగీకరించిందని చెప్పారు. 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని.. తద్వారా లబ్ధిదారులకు శిక్షణ సమయంలో ₹9వేలు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రదేశ్ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు చెందిన ఆరు డెయిరీ ప్లాంట్‌లను పదేళ్ల పాటు లీజుకు ఇవ్వడంతో పాటు బయోడీజిల్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ నిబంధనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని