Modi 3.0: నేడు 30 మంది మంత్రుల ప్రమాణస్వీకారం..?

ప్రధాని మోదీ మంత్రి వర్గంలో నేడు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Published : 09 Jun 2024 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోదీ 3.0 (Modi 3.0) ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం నేటి  సాయంత్రం జరగనుంది. ప్రధానితోపాటు కొందరు కీలక మంత్రులు మాత్రం ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. ఈ సారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనావేస్తున్నారు. గత మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగశాఖ భాజపా వద్దే కొనసాగనున్నాయి. రోడ్స్‌ అండ్‌ హైవే మంత్రిత్వశాఖ కూడా గడ్కరీ వద్దే కొనసాగే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. 

ఇక చిరాగ్‌ పాసవాన్‌, హెచ్‌డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్‌, జయంత్‌ చౌధరీ, జతిన్‌ రామ్‌ మంఝీ, సోనోవాల్‌, కిరణ్‌ రిజిజు వంటి వారు నేడు ప్రమాణ స్వీకారం చేసేవారి జాబితాలో ఉండొచ్చు. ఆదివారం సాయంత్రం 7.15 నుంచి 8.00 వరకు దాదాపు 45 నిమిషాలపాటు ఈ కార్యక్రమం జరగనుంది. 

 క్యాబినెట్‌ కూర్పుపై భాజపా సీనియర్‌ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్, జె.పి.నడ్డా కూటమిలోని భాగస్వాములతో చర్చిస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేలతో వారు మంతనాలు జరిపారు

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెదేపా ఎంపీలకు స్థానం ఖరారయింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన తెదేపా.. ఎన్డీయే కూటమిలో భాజపా తర్వాత రెండో అతిపెద్ద పార్టీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని