Shocking: సినిమాకు వెళ్తుండగా గుండెపోటు.. యువకుడి మృతి

సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకుంది.

Published : 28 Aug 2023 17:01 IST

లఖ్‌నవూ: ఆకస్మాత్తుగా గుండెపోటు(Heart attack) రావడంతో ఉన్నచోటే పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. డ్యాన్స్, వ్యాయామం వంటివి చేస్తుండగానే మరణిస్తున్నట్టు ఘటనలు తీవ్ర షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన గదర్‌ -2 చిత్రాన్ని వీక్షించేందుకు శనివారం రాత్రి సినిమా హాలులోకి వస్తున్న 35 ఏళ్ల యువకుడు రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

మృతుడిని మహేవగంజ్‌లో మెడికల్ స్టోర్ నడుపుతున్న అక్షత్ తివారీగా గుర్తించారు. అతడు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి చేరుకొని ఒక్కసారిగా నేలపై పడిపోయారు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. సినిమా హాలులో ఉన్న గార్డులు, బౌన్సర్లు అక్కడికి చేరుకొని అతడి ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు ప్రయత్నించినా ఎలాంటి చలనం లేకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్లే తివారీ ప్రాణాలు విడిచాడని ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని