UP: కాంవడ్‌ యాత్రలో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురి మృతి

యూపీలో కాంవడ్‌ యాత్ర(Kanwariya Pilgrims) చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 16 Jul 2023 10:18 IST

మేరఠ్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో విషాదం చోటుచేసుకుంది. కాంవడ్‌ యాత్ర(Kanwariya Pilgrims) చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మేరఠ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని పలువురు యాత్రికులు తిరుగు ప్రయాణమయ్యారు. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మేరఠ్‌ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో వాహనం సమీపంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు స్థానికులు.. పవర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపే.. ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో కాంవడ్‌ యాత్రికుల మృతి

ఈ ఘటన అనంతరం గ్రామస్థులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను సేకరిస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌తోపాటు, బిహార్‌, రాజస్థాన్‌, దిల్లీ, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి  మందికిపైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని