Amrit Bharat Express: 50 అమృత్‌ భారత్‌ రైళ్లకు ఆమోదం: రైల్వే మంత్రి ట్వీట్‌

ప్రయాణికుల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మరో 50 అమృత్‌ భారత్‌ రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 20 Feb 2024 02:02 IST

దిల్లీ: కేంద్రం పట్టాలెక్కించిన అమృత్ భారత్ (Amrit Bharat Express) రైళ్లకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ‘‘అమృత్ భారత్ రైలు భారీ విజయం సాధించడంతో 50 అమృత్‌ భారత్‌ రైళ్లకు ఆమోదం లభించింది’’ అని పేర్కొన్నారు. 

మొత్తం నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. దేశంలో రెండు రైళ్లు గతేడాది డిసెంబర్‌లో పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య ఏపీ మీదుగా ప్రయాణిస్తోంది. దీనికి విశేష స్పందన లభిస్తోంది.

అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫీచర్లు ఇవే..

మొత్తం 22 ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 12 స్లీపర్‌, 8 జనరల్‌, 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు వద్ద మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌, సమాచార వ్యవస్థ, బయో వ్యాక్యూమ్‌ టాయిలెట్లు, సెన్సార్‌ కుళాయిలు. పుష్‌-పుల్‌ సాంకేతికతతో తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన సీట్లు, ఎల్‌ఈడీ లైట్లు,ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు ఉన్నాయి. ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించే వీలుంటుంది. 800 కి.మీలకు పైగా దూరంలోఉన్న నగరాలను కలుపుతూ ఈ రైళ్లు సేవలందిస్తాయి. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని