Driverless Train: లోకో పైలట్లు లేకుండానే 70 కి.మీ దూసుకెళ్లిన గూడ్స్‌!

లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌లు లేకుండానే ఓ రైలు దాదాపు 70కి.మీ ప్రయాణించింది.

Updated : 25 Feb 2024 15:37 IST

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లో (Indian Railways) పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్లు (Loco pilot) లేకుండానే ఓ గూడ్స్‌ రైలు దాదాపు 70 కి.మీ పైగా దూసుకెళ్లిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. 53 వ్యాగన్లతో కూడిన ఆ రైలు జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని ఓ గ్రామం వరకు అలాగే ప్రయాణించడం గమనార్హం. మార్గమధ్యలో దాదాపు గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీసినట్లు అంచనా. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చిప్‌ స్టోన్లతో నిండిన 53 వ్యాగన్ల గూడ్స్‌ రైలు.. జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో డ్రైవర్‌ ఛేంజ్‌ కోసం కథువా రైల్వే స్టేషన్‌లో ఆగింది. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండానే లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌లు దిగిపోయినట్లు సమాచారం. దీంతో రైలు మెల్లగా పరుగులు పెట్టడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్లాక అది మరింత వేగం పుంజుకొంది. అలా దాదాపు 78కి.మీ మేర ప్రయాణించింది. వాలు కారణంగానే రైలు కదిలినట్లు అధికారులు భావిస్తున్నారు.

అప్రమత్తమైన అధికారులు దాన్ని నిలిపే ప్రయత్నం చేశారు. చివరకు పంజాబ్‌ హోషియార్‌పుర్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇసుక బస్తాలు, కర్రల సాయంతో రైలును నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ డివిజనల్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రతీక్‌ శ్రీవాస్తవ ప్రకటించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని