Rajya Sabha: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. మన్మోహన్‌ స్థానంలో రాజ్యసభకు సోనియా!

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)తోసహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు.

Published : 03 Apr 2024 00:04 IST

దిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)తో సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో వీరందరూ ఎగువసభ నుంచి నిష్క్రమించనున్నారు. అయితే, వీరిలో కొందరు తిరిగి మళ్లీ సభలో అడుగుపెట్టనుండగా.. చాలా మంది మాత్రం దూరంగా ఉండనున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ (Rajya Sabha) పదవీ కాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది. దీంతో 33 ఏళ్లుగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆయన ప్రస్థానానికి తెరపడినట్లైంది. అయితే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం తొలిసారిగా పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. ఇటీవలే ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. 91ఏళ్ల వయసున్న మన్మోహన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్‌ నుంచే సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, పశుసంవర్ధక, మత్య్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, సహాయ మంత్రి మురళీధరన్‌, నారాయణ్‌ రాణె, ఎల్‌ మురుగన్‌ల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగిసింది. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ల గడువు ఏప్రిల్‌ 3తో ముగుస్తుంది. వీరిలో అశ్వనీ వైష్ణవ్‌ మినహా మిగతా వారంతా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. వైష్ణవ్‌, మురుగన్‌లకు మాత్రమే రాజ్యసభ వెళ్లే అవకాశం మరోసారి దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని