Jammu-Kashmir: ఆర్టికల్‌ 370 రద్దు.. 66 శాతం తగ్గిన ఉగ్ర ఘటనలు: అమిత్‌ షా

జమ్మూ- కశ్మీర్‌కు రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

Published : 25 Jan 2024 19:40 IST

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 (Article 370) రద్దు అనంతరం ఉగ్రవాద సంబంధిత ఘటనలు 66 శాతం తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. పౌర హత్యల్లో 81 శాతం, భద్రత సిబ్బంది మరణాల్లో 48 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. స్థానికంగా శాంతియుగం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రాంతం ఉగ్రవాదం నుంచి పర్యాటకం వైపు మళ్లుతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూలో 100 ఈ-బస్సులకు అమిత్‌ షా పచ్చజెండా ఊపారు. స్థానికంగా ప్రభుత్వ, కారుణ్య ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక యువత ఓటర్లుగా నమోదు చేసుకుని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.

జోడోయాత్రలో రాహుల్‌గాంధీ డూప్: అస్సాం సీఎం

‘‘2000లో 2,654 రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. 2010లో రాళ్ల దాడుల్లో 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2023లో ఇటువంటివి ఒక్కటీ చోటుచేసుకోలేదు. స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధుల ప్రవాహాన్ని అరికట్టాం. ఆస్తులను అటాచ్ చేస్తున్నాం. అనేక ఉగ్ర సంస్థలపై నిషేధం విధించాం. బాంబు పేలుళ్లు, కాల్పులు, బంద్‌లు.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలతో భర్తీ అవుతున్నాయి. ఇది అతిపెద్ద మార్పు. 2019-20లో జమ్మూ- కశ్మీర్‌కు రూ.297 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022-23లో రూ.2,153 కోట్లకు పెరిగాయి. మరో రూ.6,000 కోట్లు రానున్నాయి’’ అని అమిత్‌ షా తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ‘ఆర్టికల్ 370’ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూ- కశ్మీర్, లద్ధాఖ్‌)గా విభజించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని