Himanta Biswa Sarma: జోడోయాత్రలో రాహుల్‌గాంధీ డూప్: తీవ్ర విమర్శలు చేసిన అస్సాం సీఎం

సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్ర.. అస్సాంలో అంత సాఫీగా సాగలేదు. ఈ యాత్ర వేళ.. ఆ రాష్ట్ర సీఎం నుంచి రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

Updated : 25 Jan 2024 16:56 IST

గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. యాత్రలో రాహుల్‌ డూప్‌ను వాడుతున్నారంటూ మీడియా కథనాలను ఉటంకించారు. బస్సులో ఒక గదిలో ఆయన కూర్చుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.

‘ఇదంతా నేనేమీ చూడలేదు. కానీ దీని గురించి వచ్చిన మీడియా కథనాలను మాత్రం చూశాను. మామూలుగా రాహుల్ బస్సులోనే కూర్చుంటారని కాంగ్రెస్ నేతలు కొందరు నాకు చెప్పారు. అలాంటప్పుడు రాహుల్‌లా ఉండి, మనకు కనిపిస్తోన్న వ్యక్తి ఎవరు..? అస్సాంలో ఈ యాత్ర జరిగిన ప్రతి ప్రాంతంలో భాజపా గెలుస్తుంది. అలాంటప్పుడు దీని ఉద్దేశం ఏమిటో..? మతపరమైన ఘర్షణలు సృష్టించడానికేనా..? కానీ అస్సాం ప్రజలు అలా జరగనివ్వలేదు’ అని హిమంత విమర్శించారు.

నీతీశ్‌ రూట్‌ మారనుందా..? మోదీని కొనియాడి, ‘ఇండియా’ పార్టీలకు చురకలు

ఇదిలా ఉంటే.. యాత్రలో భాగంగా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటూ రాహుల్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులపై  గువాహటి పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులకు సంబంధించి లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తరవాత అరెస్టులు ఉంటాయని హిమంత(Himanta Biswa Sarma) వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక్‌ ఖర్గే ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఎందుకు లోక్‌సభ ఎన్నికల వరకు ఎదురుచూస్తున్నారు..? రాహుల్‌ గాంధీ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే.. మీరు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ఆయన నిజం మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అలా చేయలేరు. మీ పొరుగున ఉన్న మణిపుర్ ప్రజల కోసం మీరు గళం విప్పలేదు. ప్రజల ఆవేదనను ఆయన వినిపిస్తుండటంతో మీకు భయం కలుగుతోంది’ అని విరుచుకుపడ్డారు. దీనికి హిమంత కౌంటర్ ఇచ్చారు. ‘ఎన్నికల సమయంలో రాహుల్ కావాలి’ అని వ్యంగ్యంగా బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని