Modi Oath Taking Ceremony: సప్త దేశాధినేతల సాక్షిగా..

ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసే వేడుకకు ఏడు దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే, బంగ్లాదేశ్‌ అధ్యక్షురాలు షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మత్‌ అఫీఫ్‌ ఉన్నారు.

Updated : 10 Jun 2024 08:40 IST

మోదీ ప్రమాణానికి హాజరైన ప్రముఖులు
కొత్త మంత్రులకు ప్రధాని దిశా నిర్దేశం
వేడుకకు కట్టుదిట్టంగా భద్రత
కాంగ్రెస్‌ మినహా విపక్షాలు గైర్హాజరు 

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 

ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన జనం 

దిల్లీ: ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసే వేడుకకు ఏడు దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే, బంగ్లాదేశ్‌ అధ్యక్షురాలు షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మత్‌ అఫీఫ్‌ ఉన్నారు. వారందరికీ దిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఈ దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేందుకు వీరి రాక దోహదపడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ‘పొరుగుదేశాలే ముందు’ అనే విధానానికి అనుగుణంగా వాటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన విందులోనూ విదేశీ అతిథులంతా పాల్గొన్నారు. భాజపా కురువృద్ధుడు ఎల్‌.కె.ఆడ్వాణీ నివాసానికి షేక్‌ హసీనా వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు సార్క్‌ దేశాధినేతలు హాజరయ్యారు. రెండోసారి అయినప్పుడు బిమ్స్‌టెక్‌ దేశాధినేతలు వచ్చారు. ఈసారి కొన్ని పొరుగుదేశాలు, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాధినేతల్ని ఆహ్వానించారు. 

మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి మకేశ్‌ అంబానీ

విపక్షం గైర్హాజరు 

కొత్త ప్రభుత్వం కొలువుదీరే కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే- రాజ్యసభ విపక్ష నేత హోదాలో హాజరయ్యారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని కీలక నేతలతో చర్చించిన అనంతరం కాంగ్రెస్‌ ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించింది. ఇతర విపక్షాలు కూడా గైర్హాజరయ్యాయి. నైతికంగా ప్రజామద్దతు లేకపోయినా మోదీ ప్రధాని అవుతున్నారని, అందువల్ల తాము దీనిలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని తృణమూల్‌ నేత సాగరికా ఘోష్‌ తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత 

దేశవిదేశాల ప్రముఖులు హాజరవుతున్న వేడుక కావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బహుళ అంచెల్లో ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలను రాష్ట్రపతి భవన్‌ చుట్టూ మోహరించారు. డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించారు. బందోబస్తు విధుల్లో దాదాపు 2,500 మంది పోలీసులు పాల్గొన్నారు. అతిథులు బస చేసిన హోటళ్ల నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకునే మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

కార్మికుల మురిపెం 

సమాజంలోని వివిధ వర్గాలవారిని, వందేభారత్‌ రైళ్లు నడిపిన లోకోపైలట్లు, సహాయ లోకోపైలట్లను, ట్రాన్స్‌జెండర్లను ఈ వేడుకకు ఆహ్వానించారు. హాజరైన సహాయ లోకోపైలట్లలో తెలుగువారైన నక్కా ప్రకాశ్‌ (ద.మ.రైల్వే సికింద్రాబాద్‌) ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న శ్రామికులు, మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరిని కొందరు మంత్రులు విడిగా సన్మానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకకు హాజరయ్యే అవకాశం తమకు లభించిందంటే నమ్మలేకపోతున్నామని ఝార్ఖండ్‌కు చెందిన పాస్వాన్‌ అనే నిర్మాణ కూలీ ఆనందంతో చెప్పారు. ఆహ్వాన పత్రికను హృదయానికి హత్తుకుని మురిసిపోయారు. మోదీని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంపై సీమా పవన్‌ అనే పారిశుద్ధ్య కార్మికుడు సంబరపడ్డారు.


నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

దిల్లీ: కొత్తగా కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వారంతా భేటీ కానున్నారు. అనంతరం సహచరులందరికీ భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విందు ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 


వినయంగా ఉండాలని సూచించిన మోదీ 

మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నవారితోపాటు, పాత మంత్రివర్గంలో ఉన్న కొందరు సీనియర్లకు ప్రధాని మోదీ తన నివాసంలో తేనీటి విందునిచ్చారు. వినయంగా ఉన్నవారిని సామాన్యులు ఇష్టపడతారన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. నిజాయతీగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల నుంచి ఆకాంక్షలు, అంచనాలు ఎక్కువగా ఉన్నందువల్ల దానికి తగ్గట్టుగా పని చేయాలని చెప్పారు. అప్పగించిన పనులను చిత్తశుద్ధితో పూర్తిచేయాలన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఎంపీలందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వాలని, వారంతా ప్రజల నుంచి ఎన్నికైనవారేనని చెప్పారు. ప్రభుత్వోద్యోగులు, అధికారులనూ గౌరవంగా చూడాలన్నారు. ఒక జట్టుగా, బృంద స్ఫూర్తితో పనిచేయాలని చెప్పారు. 


మహాత్మాగాంధీ, వాజ్‌పేయీలకు నివాళులు అర్పించిన మోదీ 

దిల్లీ: ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతల స్వీకరణకు ముందు ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్టీయ్ర స్మృతిస్థల్‌ వద్ద  నిర్మించిన సదైవ్‌ అటల్‌ను సందర్శించి భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత జాతీయ యుద్ధస్మారకం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు భాజపా సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్, భారత త్రివిధ దళాల అధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే, నేవీ అడ్మిరల్‌ చీఫ్‌ దినేశ్‌ త్రిపాఠి పాల్గొన్నారు.


పిన్న వయస్కుడు రామ్మోహన్‌.. పెద్ద వయస్కుడు మాంఝీ

దిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ 3.0 మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కాగా, అతి పెద్ద వయస్కుడు హిందూస్థానీ ఆవామ్‌ మోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్‌ రామ్‌ మాంఝీ. వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికైన రామ్మోహన్‌ వయసు 36 ఏళ్లు కాగా, బిహార్‌లోని గయా నుంచి ఎన్నికైన మాంఝీకి 79 ఏళ్లు. మాంఝీ గతంలో బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుల్లో.. మహారాష్ట్రకు చెందిన భాజపా ఎంపీ రక్షా నిఖిల్‌ ఖడ్సే(37), లోక్‌జన్‌శక్తిపార్టీ-ఆర్వీ ఎంపీ చిరాగ్‌ పాస్వాన్‌(41), రాష్ట్రీయ లోక్‌దళ్‌ ఎంపీ జయంత్‌ చౌధరి(45) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని