‘భగవద్గీత’ తెచ్చిన మార్పు.. 9ఏళ్ల క్రితం చోరీ చేసిన ఆభరణాల్ని ఇచ్చేసిన దొంగ!

తొమ్మిదేళ్ల క్రితం ఆలయంలో చోరీ చేసిన ఆభరణాల్ని ఓ దొంగ తిరిగి ఇచ్చేసిన ఘటన  ఒడిశాలో చోటుచేసుకుంది. భగవద్గీత పఠించడం వల్ల తనలో వచ్చిన పరివర్తనే ఇందుకుకారణమంటూ అతడు రాసిన ఓ నోట్‌ చర్చనీయాంశంగా మారింది.

Published : 18 May 2023 01:38 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్ర గ్రంథం భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. దీంతో తొమ్మిదేళ్ల క్రితం ఓ ఆలయంలో చోరీ చేసిన విలువైన నగల్ని అతడు తిరిగి ఇచ్చేశాడు. అంతేకాకుండా  తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ ఆలయ పూజారికి లేఖ రాసి అక్కడ వదిలి వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్‌ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీకి గురైన శ్రీకృష్ణుడి ఆభరణాలు ఓం సంచితో పాటు ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాటు క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300లు ఆలయ ముఖద్వారం వద్ద లభ్యమయ్యాయి. అయితే, ఇటీవల భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని రూ.లక్షల విలువ చేసే ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. 2014లో యజ్ఞశాలలో ఆభరణాల్ని చోరీ చేసినప్పట్నుంచి తనకు పీడకలలు వస్తున్నాయని.. అనేక సమస్యలు తనను చుట్టుముట్టినట్టు లేఖలో పేర్కొన్నాడు. 

మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ పూజారి దేబేష్‌ చంద్ర మహంతి మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి కిరీటం, చెవిపోగులు, కంకణాలు, వేణువు తదితర ఆభరణాలతో బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ముఖద్వారం వద్ద వదిలి వెళ్లిపోయారని తెలిపారు. అతడు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ.. ఆ బ్యాగులో రూ.300లు కూడా ఉంచాడన్నారు.  చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమేనన్నారు. ఆభరణాలు మళ్లీ ఇలా కనిపిస్తాయని తాము అనుకోలేదని చెప్పారు. చోరీ ఘటన తర్వాత దేవతామూర్తులకు తాము కొత్త ఆభరణాలు చేయించామన్నారు. ఇది దైవ ప్రమేయం వల్లే జరిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని