కొత్త ఎంపీల్లో 93 శాతం మంది మిలియనీర్లే: ఏడీఆర్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఏడీఆర్ ఆసక్తికర నివేదికను వెలువరించింది. కొత్తగా లోక్‌సభలో కొలువుదీరనున్న ఎంపీల్లో 93 శాతం మంది మిలియనీర్లే అని పేర్కొంది. 

Published : 06 Jun 2024 17:09 IST

దిల్లీ: ఈసారి లోక్‌సభకు భారీ సంఖ్యలో ధనవంతులు ఎన్నికయ్యారు. 543 మంది కొత్త ఎంపీల్లో 504 మంది మిలియనీర్లు ఉన్నారు. అంటే 93 శాతం మంది సంపన్నులు ఉన్నారని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది.

సంపదపరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఎంపీల్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. గుంటూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెదేపా నేత చంద్రశేఖర్ పెమ్మసాని ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ఉంది. తెలంగాణలోని చేవెళ్ల నుంచి పోటీ చేసి, విజయం సాధించిన భాజపా నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తుల మొత్తాన్ని రూ.4,568 కోట్లుగా పేర్కొన్నారు. మూడో స్థానంలో ఉన్న నవీన్ జిందాల్‌.. రూ.1,241 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయన హరియాణాలోని కురుక్షేత్ర నుంచి గెలుపొందారు.

2019లో 475 మంది మిలియనీర్లు ఉండగా.. 2014లో ఆ సంఖ్య 443గా ఉంది. 2009 నుంచి మిలియనీర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అప్పుడు 58 శాతం (315) మంది సంపన్నులు ఎన్నికయ్యారు. భాజపా నుంచి గెలుపొందిన 240 మంది ఎంపీల్లో 227 మంది అంటే 95 శాతం మంది ఆస్తిపరులే. 99 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 92 మందితో పాటు మిగతా పార్టీల్లో కూడా ఎన్నికైన అభ్యర్థుల్లో 90 శాతానికి పైగా ధనవంతులే ఉన్నారు. ఇక ఆప్‌(3), జేడీయూ(12), తెదేపా(16) నుంచి విజయం సాధించిన వారంతా మిలియనీర్లే కావడం గమనార్హం.

ఏడీఆర్ గణాంకాల ప్రకారం.. 42శాతం మంది అభ్యర్థులకు రూ.10 కోట్లు లేదా అంతకుమించిన ఆస్తులున్నాయి. 19 శాతం మందికి రూ.5 నుంచి 10 కోట్ల మధ్య సంపద ఉంది. 32 శాతం మందికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య, ఒక శాతం మందికి మాత్రం రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయి. అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాల ఆధారంగా గెలుపు అవకాశాలను ఏడీఆర్ నివేదిక విశ్లేషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని