Heat Wave: వడగాలులతో బెంబేలు.. మూడు రోజుల్లో 98 మంది మృతి

దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూపీ, బిహార్‌లో గడిచిన మూడు రోజుల్లోనే వడదెబ్బ (Heatwave) కారణంగా 98మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 18 Jun 2023 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల (Heat Wave) ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

యూపీలోని అనేక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బలియా జిల్లాలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా ఇక్కడ 400 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటివరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్‌ 15న 23 మంది, మరుసటి రోజు 20 మంది, తాజాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారని బలియా జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే, వారి మరణానికి అనేక అంశాలు కారణమని.. అందులో వడదెబ్బ కూడా ఒకటి అని చెప్పారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు ఇతర కారణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారని.. గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయేరియాలతో చనిపోతున్నారని తెలిపారు.

ఇక బిహార్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 మంది చనిపోగా.. రాజధాని పట్నాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. నలందా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 19 మంది, పీఎంసీహెచ్‌లో 16 మంది మృత్యువాతపడ్డారు. మరో తొమ్మిది మరణాలు ఇతర జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్నా, షేక్‌పురాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్కడి విద్యాసంస్థలకు జూన్‌ 24వరకు సెలవులు పొడిగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని