Kumbh Mela: కుంభమేళాలో తొక్కిసలాట: భారత్‌ ఉక్కిరిబిక్కిరైన ఘటనలు ఇవి..!

Eenadu icon
By National News Team Updated : 29 Jan 2025 12:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కుంభమేళా(Kumbh Mela)లో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. దీంతో నేటి తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు, మేళాల సందర్భంగా పలుమార్లు దుర్ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో దాదాపు 200 మందికిపైగా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాదాలు గుర్తుచేస్తూనే ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా వదంతులు, భక్తుల్లో భయాలు, కొందరు నాయకుల అత్యుత్సాహం వంటి వాటివల్లే ఇలాంటివి చోటుచేసుకొన్నాయి. 

గత కుంభమేళాల్లో కూడా..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. నాడు ఫిబ్రవరి 3వ తేదీన తొక్కిసలాట చోటుచేసుకొంది. దేశ చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,000 మంది గాయపడ్డారు. అది కూడా మౌని అమావాస్య నాడే చోటుచేసుకొంది. నాడు ఒక ఏనుగు అదుపుతప్పి దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. 

  • 1986 ఏప్రిల్‌ 14న కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర్‌బహదూర్‌ సింగ్‌ తనతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్‌ సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు వచ్చారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకొని 200 మంది మరణించారు. 
  • 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. నాడు జరిగిన తొక్కి సలాటలో 39 మంది మరణించారు.
  • 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10వ తేదీన తొక్కిసలాట చోటుచేసుకొంది. ఒక ఫుట్‌ బ్రిడ్జ్‌ కూలిపోవడమే దీనికి కారణం. ఈ ఘటనలో 42 మంది మరణించారు. 

హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌..

గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట చోటుచేసుకొంది. దీనిలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈక్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకొంది.

నవరాత్రి వేళ రత్నఘడ్‌ మందిరంలో..

2013 అక్టోబర్‌ 13న మధ్యప్రదేశలోని రత్నఘడ్‌ మందిరంలో నవరాత్రి సందర్భంగా దాదాపు 1,50,000 మంది భక్తులు వచ్చారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే స్థితికి వచ్చిందనే వదంతులు రావడంతో.. ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకొంది. దీంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. 

చాముండేశ్వరీదేవి ఆలయంలో..

రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్‌ 30న తొక్కిసలాట చోటుచేసుకొంది. దీనిలో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 420 మందికి పైగా గాయపడ్డారు. బాంబు పేలుడు భయాలు ఈ ప్రమాదానికి కారణమని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. 

కొండచరియలు విరిగి పడ్డాయంటూ..

2008 ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో తోపులాట చోటుచేసుకొని 145 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు కొండచరియలు విరిగిపడుతున్నాయన్న వదంతులే దీనికి కారణమని గుర్తించారు. 

జారుడు మెట్లతో..

మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాడు ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండటంతో ఒక్కసారిగా జనం ఒకరిపైకి మరొకరు పడ్డారు. ఈ సందర్భంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags :
Published : 29 Jan 2025 12:19 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు