Swati Maliwal: మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

 తనపై దాడి జరిగిందని స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించిన రోజునాటి దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. 

Published : 18 May 2024 11:45 IST

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపణల నేపథ్యంలో.. మరికొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. బయటకు తీసుకువెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు. నిజాలు వెలుగులోకి వచ్చాయంటూ.. ఘటన రోజు, ఆమె కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన రోజు దృశ్యాలున్న వీడియోను ఆప్‌ షేర్ చేసింది.

శుక్రవారం కూడా కేజ్రీవాల్‌ ఇంటి నుంచి ఒక క్లిప్‌ బయటకు వచ్చింది. అందులో ఆమె భద్రతా సిబ్బందితో వాదించడం కనిపించింది. ఆ వీడియో వెలుగులోకి రాగానే.. హిట్‌మ్యాన్‌ అంటూ మాలీవాల్‌ ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అయితే ఆమె చెప్పిన హిట్‌మ్యాన్‌ ఎవరో తెలియాల్సి ఉంది.

తనపై సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా మాలీవాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆరోపణలు చేయడం వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్వాతి ఓ పావు మాత్రమేనన్నారు.  అపాయింట్‌మెంట్‌ లేకుండా ముఖ్యమంత్రి ఇంటికి స్వాతి చేరుకున్నారని, కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయడమే ఆమె ఉద్దేశమని ఆప్‌ సీనియర్‌ నేత ఆతిశీ పేర్కొన్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని