Kota: నీట్‌ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. 

Updated : 28 Nov 2023 11:12 IST

కోటా: రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హుస్సేన్‌ అనే విద్యార్థి నీట్‌ (NEET)కు సిద్ధమవుతున్నాడు. శిక్షణ కోసం గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో స్నేహితులు అతడికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. గది తలుపులు తెరిచారు. అక్కడ ఉరి వేసుకుని కనిపించిన ఆ విద్యార్థిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే, తన గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించలేదు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు

పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కోటాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వసతి గృహాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విధంగా శిక్షణ ఇవ్వడం.. విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టు ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినా సరే.. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలవరపెడుతోంది. గతేడాది 15 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు తీసుకోవడం బాధాకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని