Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్‌ డ్రిల్లింగ్‌లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

Published : 28 Nov 2023 10:06 IST

ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కన్పిస్తోంది. నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) తవ్వకాలు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు 50 మీటర్ల తవ్వకం పూర్తయినట్లు సహాయక బృందంలోని అధికారులు వెల్లడించారు. కూలీలను చేరుకోవాలంటే మరో 10 మీటర్ల తవ్వాల్సి ఉందన్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే నేటి సాయంత్రానికి రెస్క్యూ పనులు కీలక దశకు చేరుకుని ‘మంచి వార్త’ వినే అవకాశముందని చెబుతున్నారు.

అంతకుముందు సొరంగంలో చిక్కుకున్న కూలీలను చేరుకోవడం కోసం ఆగర్‌ యంత్రంతో దాదాపు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సదరు యంత్రం విరిగిపోయి మధ్యలోనే చిక్కుకుపోయింది. దీంతో మ్యానువల్‌ డ్రిల్లింగ్‌ చేపట్టి యంత్రాన్ని దాని నుంచి తొలగించారు. ఆ తర్వాత ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ నిన్న రాత్రి నుంచి తవ్వకాలు ప్రారంభించారు. సమాంతరంగా తవ్వకం పూర్తయిన తర్వాత 800 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను మెల్లగా సొరంగంలో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు.

అమెరికాలో పని అనుమతులపై రగడ

మరోవైపు కొండ పైభాగం నుంచి చేపట్టిన డ్రిల్లింగ్‌ పనులు ఇప్పటికే 42 మీటర్లు పూర్తయ్యాయి. నిట్టనిలువుగా 86 మీటర్లుండగా.. ఇందులో దాదాపు సగం పని పూర్తయినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.20 మీటర్ల వెడల్పైన గొట్టాలను వీటిద్వారా ప్రవేశపెడుతున్నారు. కొండలో ఎక్కడెక్కడ మట్టి స్వభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు మొదట చేపట్టిన పనుల్లో భాగంగా 200 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను 75 మీటర్ల వరకు పంపించగలిగారు. అంటే అక్కడి వరకు ఆటంకాలు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు.

ఈ కూలీలు గత 16 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇటీవల వారు ఉంటున్న ప్రాంతం వద్దకు ఎండోస్కోపి తరహాలోని కెమెరాను పంపి వారితో మాట్లాడారు. కూలీలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారి కోసం గొట్టాల్లో నుంచి ఆహారం, పానీయాలను పంపుతున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వాకీటాకీలను పంపి వారితో అధికారులు మాట్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని